COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 22,018 పాజిటివ్ కేసులు నమోదు, కరోనాతో మరో 96 మంది మృతి; ఏపి నుంచి టీఎస్ వెళ్లే అంబులెన్సులకు లైన్ క్లియర్ చేసిన హైకోర్ట్
COVID-19 | (Photo Credits: IANS)

Amaravathi, May 14:  ఆంధ్రప్రదేశ్‌లో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రతిరోజు కనీసం 22 వేలకు తకువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కూడా అదే స్థాయిలో  కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడం కోసం ప్రభుత్వం గత రెండు వారాలుగా ఏపిలో పాక్షిక లాక్ డౌన్ ను అమలు పరుస్తుంది. అయినప్పటికీ కేసుల తగ్గుదలలో ఎలాంటి మార్పులేకపోవడం గమనార్హం.

రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 89,087 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 22,018 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 13,88,803కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 13,85,908గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 3,432 కోవిడ్ కేసులు నమోదు కాగా..  చిత్తూరు నుంచి 2,708, అనంతపూర్ నుంచి 2,213 అలాగే విశాఖపట్నం నుంచి 2,200 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 96 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 9,173కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 19,177 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 11,75,843 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 20,37,87 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ఇదిలా ఉంటే,  ప్రతిరోజు పెద్ద సంఖ్యలో కోవిడ్ బాధితులు మెరుగైన చికిత్స కోసం ఏపి నుంచి హైదరాబాద్ నగరానికి వెళ్తున్నారు. అయితే తెలంగాణ సరిహద్దు వద్ద టీఎస్ పోలీసులు ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మ్ అయితేనే అనుమతిస్తామని అంబులెన్సులను అడ్డుకోవడం రెండు రాష్ట్రాల మధ్య సామాజికంగా, రాజకీయంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో మరోసారి జోక్యం చేసుకున్న తెలంగాణ హైకోర్ట్ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ఉత్తర్వులపై తాజాగా స్టే విధించింది. అంబులెన్సులను అడ్డుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఏ రూపంలోనూ అంబులెన్సులను అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దని స్పష్టం చేసింది.