COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన ఒక్కరోజులో కొత్తగా 22,610 పాజిటివ్ కేసులు నమోదు, కోవిడ్ నుంచి 23,098 మంది రికవరీ,  కరోనాతో మరో 114 మంది మృతి
COVID-19 | (Photo Credits: IANS)

Amaravathi, May 20: ఆంధ్రప్రదేశ్‌లో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి కొనసాగుతోంది. అయితే ప్రతిరోజు నమోదయే పాజిటివ్ కేసుల కంటే రికవరీ అయ్యే వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం శుభపరిణామం. ఈ క్రమంలో ఆక్టివ్ కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఏమి లేదు. అయితే మరణాల సంఖ్య ఏ మాత్రం తగ్గకపోవడం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ ఈరోజు అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా శాశ్వత ప్రాతిపాదికన చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు.

రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,01281 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 22,610 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 15,21,142కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 15,18,247గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 3,602 కోవిడ్ కేసులు నమోదు కాగా..  పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 2,066 కేసులు వచ్చాయి. చిత్తూరు  నుంచి కూడా భారీగా  3,185 కేసులునమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 114 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 9,800కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 23,098 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 13,02,208 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 2,09,134 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ఇక, కరోనాకు తోడుగా బ్లాక్ ఫంగస్ మరో సమస్యగా పరిణమించింది. ఏపిలో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం, బ్లాక్ ఫంగస్ ను కూడా 'ఆరోగ్య శ్రీ' లో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.