AP's COVID Status: వ్యాక్సినేషనే కరోనా నివారణకు సరైన పరిష్కారం.. ప్రధానితో ఏపి సీఎం జగన్; ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2,345 కోవిడ్ కేసులు మరియు 16 మరణాలు నమోదు
COVID-19 Vaccination (Photo Credits: PTI)

Amaravathi, July 16: కోవిడ్‌ నివారణ చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఉన్నట్లుగా ఏపీలో లేవని ప్రధానికి వివరించారు. అయినా సరే కోవిడ్‌ను ఎదుర్కోవడంలో చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచామని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేశాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు 12 సార్లు ఇంటింటికీ ఫీవర్‌ సర్వే చేశామని, లక్షణాలున్నవారిని గుర్తించి, టెస్టులు చేసి, వైద్య సేవలు అందించామన్నారు. దీనివల్ల కోవిడ్‌ వ్యాప్తిని అడ్డుకోగలిగామన్నారు.

కరోనా నివారణకు వ్యాక్సినేషన్‌ సరైన పరిష్కారమని, ప్రైౖవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన నిల్వ కోటాను తిరిగి ఏపికి కేటాయించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం ఏపిలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 81,740 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 2,345 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 19,34,450కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 19,31,555గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 508 కోవిడ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరు జిల్లా నుంచి 332 కేసులు వచ్చాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 16 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 13,097కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 3001 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 18,96,499 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 24,854 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.