Amaravati, January 8: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ వ్యాప్తి దాదాపు నియంత్రణలోకి వచ్చేసింది, ఇక త్వరలో వ్యాక్సిన్ కూడా రాబోతున్న నేపథ్యంలో వైరస్ ను పూర్తిగా కట్టడి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం కొన్ని దేశాల్లో కొత్త వేరియంట్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. యూకే స్ట్రెయిన్ నివారణ కోసం కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లను, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మాస్క్ ధరించేలా చూడాలని, కంటైన్‌మెంట్ వ్యూహాలను అనుసరించాలని ఆరోగ్యశాఖ పేర్కొంది. సంక్రాంతి పండగ దృష్ట్యా భారీ జనసమూహాలు లేకుండా చూడాలని, ప్రస్తుతం ఉన్న శాంపుల్స్ సేకరణ కేంద్రాలను పెంచటంతో పాటు కంటైన్‌మెంట్ జోన్లను నోటిఫై చేయడం, ఫీవర్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 59,671 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 319 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,84,490కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,81,595గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో ఎక్కువగా కృష్ణా జిల్లా నుంచి 46, చిత్తూరు నుంచి 44 మరియు గుంటూరు జిల్లా నుంచి 39 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:
గడిచిన ఒక్కరోజులో మకరోనాతో కృష్ణా జిల్లాలో ఒకరు చనిపోయారు. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 7127కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 308 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,74,531 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 2,832 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.