Amaravathi, May 16: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా మరో 48 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 2205కు చేరింది. ఈరోజు కర్నూలులో మరొక కోవిడ్-19 పేషెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 49కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 101 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 1353 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 803 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు :
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,628 సాంపిల్స్ ని పరీక్షిస్తే కర్నూల్, నెల్లూరు, గుంటూరు జిల్లాల నుంచి చెరి 9 చొప్పున కేసులు, చిత్తూరు జిల్లా నుంచి 8, కృష్ణాలో 7, విశాఖలో 4, మరియు కడప, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఒక్కో కేసు చొప్పున 48 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. ఇందులో 31 మంది తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన వారేనని అధికారులు వెల్లడించారు. కరోనాలో చైనాను వెనక్కి నెట్టిన భారత్, కోవిడ్-19 ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రపంచ దేశాలలో 11వ స్థానంలో ఇండియా
ఇవేకాక, ఇతర రాష్ట్రాల నుంచి ఏపికి వచ్చిన వారిలో ఇప్పటివరకు 150 మంది కరోనా పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. వీరి సంఖ్యను ఏపి జాబితాలో కాకుండా అధికారులు విడిగా చూపుతున్నారు. 150లో 101 మంది మహారాష్ట్ర నుంచి రాగా, గుజరాత్ నుంచి 26 మంది, రాజస్థాన్ నుంచి 11, ఒడిషా నుంచి 10, వెస్ట్ బెంగాల్ మరియు కర్ణాటక నుంచి ఒకరు చొప్పున పాజిటివ్ గా నిర్ధారింపబడినట్లు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.