AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా 6,096 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై జిల్లా స్థాయి అధికారులతో సీఎం జగన్ సమీక్ష, లాక్‌డౌన్‌పై క్లారిటీ!
AP CM Jagan Review Meeting | Photo: FB/AP CMO

Amaravathi, April 16:  ఆంధ్రప్రదేశ్‌లో సెకండ్ వేవ్ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ జిల్లా కలెక్టర్లు మరియు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు అర్బన్ ప్రాంతాల్లో 62 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 38 శాతం ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. అయితే కోవిడ్ మరణాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో లాక్డౌన్ లేకుండానే కోవిడ్ నివారణ చర్యలు మరియు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్ధేశం చేశారు. ట్రేసింగ్- టెస్టింగ్- ట్రీట్మెంట్‌పై దృష్టిపెట్టాలని సూచించారు. గ్రామీణ కరోనా టెస్టులు అందరికీ అందుబాటులో ఉండాలని తెలిపారు. గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు మొదలగు వారితో ఇంటింటి సర్వే నిర్వహించాలి, కరోనా పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

అలాగే 'టీకా ఉత్సవ్' కార్యక్రమం అమలు కోసం, 45 ఏళ్ల పైబడి పౌరులకు రాబోయే మూడు వారాల పాటు టీకా వేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 60 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు.

ఇక, రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,962 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 6,096 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 9,48,231 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 9,45,336గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 1,024 కోవిడ్ కేసులు నమోదు కాగా.. తూర్పు గోదావరి నుంచి 750, గుంటూరు నుంచి 735,  కర్నూల్ నుంచి 550, శ్రీకాకుళం నుంచి 534, ప్రకాశం నుంచి 491 మరియు విశాఖపట్నం నుంచి 489 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 20 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7,373కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 2,194 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 9,05,266 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 35,592 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.