Amaravati, July 25: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి రోజురోజుకి మరింత పెరుగుతూ పోతుంది. ప్రతిరోజు వచ్చే పాజిటివ్ కేసుల సంఖ్య ఇటీవల కాలంగా కనీసం 7 వేలకు తక్కువ కాకుండా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కొవిడ్ బాధితుల సంఖ్య 90 వేలు దాటి లక్ష వైపు వేగంగా పరుగులు పెడుతోంది.
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 7,627 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 96,298 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 93,403 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఇటీవల కాలంగా రాష్ట్రంలో 50కి పైబడి కరోనా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన ఒక్కరోజులోనే కూడా మరో 56 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 1041 కు పెరిగింది.
AP's COVID19 Report:
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 3,041 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 46,301 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 48,956 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
గడిచిన ఒక్కరోజులో 47,645 మంది శాంపుల్స్ పరీక్షించినట్లు తెలిపింది. ఈరోజు వరకు సుమారుగా 16,43,319 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.