COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో 796 పాజిటివ్ కేసులు నమోదు, గత 24 గంటల్లో 11 మంది మృతి, రాష్ట్రంలో 12 వేలు దాటిన మొత్తం కోవిడ్19 బాధితుల సంఖ్య
Image Used For Representative Purpose Only. | File Photo

Amaravathi, June 27: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ వ్యాప్తి విషయంలో ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా మరో 796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 12,285 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 10,093 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 24,458 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 11 కరోనా మరణాలు నమోదయ్యాయి.  కృష్ణా జిల్లా నుంచి నలుగురు, కర్నూల్ నుంచి నలుగురు మృతిచెందగా,  తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు విజయనగరం జిల్లాల నుంచి  ఒకరు చొప్పున ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తాజా మరణాలతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 157 కు పెరిగింది.

AP COVID19 Report: 

status of positive cases of #COVID19 in Andhra Pradesh

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 263 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 5,580 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 6,648 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.