2020 Coronavirus Pandemic in India (photo-Ians)

Amaravati, Mar 27: ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 42,696 కరోనా పరీక్షలు నిర్వహించగా... 947 మందికి పాజిటివ్ (Andhra Pradesh Covid) నిర్ధారణ అయింది. ఇక ఒక్క చిత్తూరు జిల్లాలోనే 180 కేసులు (Coronavirus in AP) గుర్తించారు. గుంటూరు జిల్లాలో 145 కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 113 కేసులు, విశాఖపట్నంలో 156 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో ఎటువంటి మరణాలు సంభవించలేదు.

గత 24 గంటల్లో 377 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 4,715 మంది చికిత్స పొందుతున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 1,49, 58,897 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. మొత్తం కేసుల సంఖ్య 897810కు చేరాయి. 885892 మంది ఇప్పటివరకు కోలుకున్నారు. 7203 మంది ఇప్పటివరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

విజయవాడ నుంచి వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థికి తొలి కరోనా కేసు నమోదైంది. దీంతో ఏయూలో 800 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వారిలో 65 మందికి పాజిటివ్ తేలింది. ఈ సమాచారంతో గ్రేటర్ విశాఖ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వసతిగృహాలను సందర్శించారు. కరోనా కేసులు రావడంతో ఏయూలో నేడు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. పరీక్షల తేదీల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

ఆంధ్రా విశ్వవిద్యాలయంలో 65 మంది విద్యార్థులకు కరోనా, క్యాంపస్‌లోని 7 బ్లాక్‌లు కంటైన్‌మెంట్‌ జోన్‌లోకి, క్వారంటైన్‌లో ఇంజినీరింగ్ కళాశాల వసతిగృహాలు, ఏయూలో నేడు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా

ఈ సందర్భంగా హాస్టల్స్ వద్ద ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేస్తామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విశాఖ ఆర్డీఓ కిశోర్ చెప్పారు. కరోనా వచ్చిన వారిలో తక్కువగానే పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని, హాస్టల్స్‌లో ప్రత్యేక గదుల్లో ఉంచి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆర్డీఓ వివరించారు. వెయ్యి మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. మరికొంతమంది రిజల్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

విశాఖ ఏయూలో కరోనా కేసులపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. వైద్యారోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఏయూలో 65 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయినట్లు గుర్తించారు. దీంతో విశాఖ డీఎంహెచ్‌ఓ సూర్యనారాయణతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. రోజు 7,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

విశాఖ జిల్లాలో 6 కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్‌ఓ మంత్రికి వివరించారు. కోవిడ్ ఆస్పత్రులో వెయ్యి బెడ్లు సిద్ధం చేశామని, కరోనా సోకిన 15 మంది కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల వైద్యాధికారులను అప్రమత్తం చేశామని, కరోనా నివారణ చర్యలపై టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి ఆళ్ల నాని సమీక్షిస్తున్నారు.