Coronavirus Outbreak in AP | Photo: IANS

Vijayawada, April 2: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)  రాష్ట్రంలో తొలి కోవిడ్-19 మరణం (Coronavirus Death) నమోదైంది. విజయవాడకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి కరోనావైరస్ సోకి మరణించించినట్లు ఏపీ రాష్ట్ర ఆరోగ్య శాఖ శుక్రవారం అధికారికంగా ధృవీకరించింది. వాస్తవానికి ఈ మరణం గత సోమవారమే నమోదైనా, కరోనావైరస్ మృతిగా ధృవీకరించేందుకు ఆలస్యం అయింది.

బాధితుడు కరోనా లక్షణాలతో మార్చి 30న విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అయితే ఆసుపత్రిలో చేరిన గంట వ్యవధిలోనే చనిపోయాడని రిపోర్ట్స్ పేర్కొన్నాయి. బాధితుడికి హైపర్ టెన్షన్ తో పాటు, డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ చేతనే బాధితుడి మరణానికి గల అసలు కారణం ఏంటో తెలుసుకోడానికి ఆలస్యమైందని వెల్లడించింది.

మృతుడికి అతడి కొడుకు ద్వారా కరోనావైరస్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఇతడి కుమారుడు గత నెల దిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన మతపరమైన సమ్మేళనానికి హాజరై, తిరిగి వచ్చాడు. రోజులు గడిచినా కొద్ది లక్షణాలు తీవ్రం అవడంతో తండ్రీ, కొడుకులిద్దరూ మార్చి 30న ఆసుపత్రిలో చేరారు. కుమారుడికి మార్చి 31న కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. వీరితో కలిసిన మరో 29 మందిని గుర్తించి వారందరినీ క్వారంటైన్ కు తరలించినట్లు అధికారులు స్పష్టం చేశారు.   ఏపీలో ఇప్పటివరకు 161 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.  ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా నమోదైన కోవిడ్-19 కేసుల వివరాల కోసం క్లిక్ చేయండి

ఇదిలా ఉండగా కరోనావైరస్ బారిన పడిన రాజమండ్రికి చెందిన యువకుడు ప్రస్తుతం పూర్తిగా కోలుకొని శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. బాధితుడు లండన్ నుంచి వచ్చాడు, ఇతడికి మార్చి 22న పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే రెండు వారాల్లోనే పూర్తిగా కోలుకొని నేడు డిశ్చార్జ్ అయినట్లు అధికారులు వెల్లడించారు.