COVID-19 in Andhra Pradesh | Photo: IANS

Amaravathi, April 3: మొన్నటివరకు దేశంలోనే అత్యల్పంగా కేసులు నమోదు చేసిన ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) , గడిచిన మూడు రోజుల్లోనే 'పవర్ ప్లే' ఆడుతున్నట్లుగా ఒక్కసారిగా స్కోర్ పెంచింది. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని కేసుల సంఖ్యకు ఎంతో దూరంలో ఉన్న ఎపీ, ఇప్పుడు కోవిడ్-19 కేసుల విషయంలో ఆ రాష్ట్రంతో నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ పడుతుంది. శుక్రవారం ఉదయం రిపోర్ట్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 161కి చేరింది.

తెలంగాణలో 154కు చేరిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు

గురువారం వరకు 149 గా ఉన్న కేసులు, గత రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు మరో 12 కేసులు కొత్తగా రావడంతో సంఖ్య 161కి పెరిగిందని వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరు నుంచి 8 ఉండగా, విశాఖ నుంచి 3 కేసులు నమోదయ్యాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలకు కోవిడ్-19 విస్తరించింది. అత్యధిక కేసులు నెల్లూరు జిల్లాలోనే నమోదవుతున్నాయి.

జిల్లాల వారీగా శుక్రవారం ఉదయం వరకు నమోదైన కేసులను పరిశీలిస్తే నెల్లూరు 32, కృష్ణా 23, గుంటూరు 20, కడప 19, ప్రకాశం 17, పశ్చిమ గోదావరి 15, విశాఖపట్నం 14, తూర్పు గోదావరి 9, చిత్తూరు 9, అనంతపురం 2, కర్నూల్ 1 గా ఉన్నాయి.

ఈ కేసుల్లో దిల్లీ నుంచి వచ్చిన వారివే ఎక్కువగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. పాజిటివ్‌ కేసులు నమోదైన వారి ఇళ్ల చుట్టుపక్కల 2 కి.మీ. ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుని కరోనా లక్షణాలున్న అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించి, క్వారైంటైన్ కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు తీసుకున్న నమూనాల్లో 1,321 నెగిటివ్‌ అని తేలాయని, మరో 409 కేసులకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు.