AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 5086 కోవిడ్ కేసులు నమోదు, రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష,  కోవిడ్ కట్టడి దిశగా అధికారులకు సూచనలు చేసిన సీఎం
COVID-19 in AP (Photo Credits: PTI)

Amaravathi, April 15: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభన తీవ్రంగానే ఉంది. గతంలో కంటే టెస్టుల సంఖ్య తక్కువగా చేస్తున్నప్పటికీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజూవారీ కేసులు గురువారం 5 వేలకు పైగా నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ కోవిడ్ కట్టడి మరియు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన వెంటనే రోగికి 3 గంటల్లో అసుపత్రిలో బెడ్ కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వారికి అధిక ఫీజులు వసూలు చేయకుండా పర్యవేక్షణ ఉండాలన్నారు. కరోనాకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా 104 నంబరుకు,  అలాగే ఏవైనా ఫిర్యాదులుంటే 1902 నంబరుకు ఫోన్ చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఇక గడిచిన ఒక్కరోజులోనే రాష్ట్రంలో  6.28 లక్షల డోసుల టీకాలు పంపిణీ చేయడం పట్ల అధికార యంత్రాంగాన్ని సీఎం అభినందించారు. ఇదే స్పూర్థిని రాబోయే రోజుల్లో కూడా కొనసాగించాలని,  అవసరమైతే అదనపు  వ్యాక్సిన్ డోసుల కోసం కేంద్రానికి లేఖ రాస్తానని సీఎం జగన్ వెల్లడించారు.

ఇక, రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,741 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 5,086 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 9,42,135 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 9,39,240గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 835 కోవిడ్ కేసులు నమోదు కాగా.. కర్నూల్ నుంచి 626, గుంటూరు నుంచి 611 కేసులు, శ్రీకాకుళం నుంచి 568, తూర్పు గోదావరి నుంచి 450 మరియు విశాఖపట్నం నుంచి 435 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 14 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7,353కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1,745 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 9,03,072 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 31,710 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.