
Amaravati, Sep 30: తమ ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం విజయవంతమయిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ఇటీవల ఈ కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారని... ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారని తెలిపారు. మరింత కష్టపడాలని ఎమ్మెల్యేలకు జగన్ సూచించారని... అయితే, ఆయన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని... కొందరు ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారని తప్పుడు ప్రచారం చేశారని అన్నారు.
ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల దారుణంగా వ్యవహరిస్తోందని, వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందిస్తూ..ఈ వ్యాఖ్యలపై తాము స్పందిస్తే మరింత రచ్చ కావడం మినహా మరేమీ ఉండదని చెప్పారు. ఉపాధ్యాయులతో తమ ప్రభుత్వం మంచిగా వ్యవహరిస్తోందని... వారికి ఇప్పటికీ ఏమైనా సమస్యలు ఉంటే చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధమని అన్నారు. ఆయనకు వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అని వ్యాఖ్యానించారు.
రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల మంచే జరుగుతుందని... దీనిపై ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు చేసే విమర్శలను పట్టించుకోబోమని అన్నారు.ఉచిత విద్యుత్‌పై మాట్లాడే నైతిక హక్కు ఎవరికీ లేదన్నారు సజ్జల. తెలంగాణ మంత్రి హరీష్ రావు ఎందుకు అలా మాట్లాడారో తనకు తెలీదని అన్నారు. వాళ్ల సమస్యలు వాళ్లు చూసుకోకుండా తమపై కామెంట్ చేయడం సరికాదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలపై మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ముందు వాళ్ల సమస్యలపై హరీష్ రావు దృష్టి పెడితే మంచిది అని సజ్జల సూచించారు.