Jagananna Vidya Kanuka: విద్యార్థులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్, 43 లక్షల మంది విద్యార్థులకు జూన్ 12న జగనన్న విద్యా కానుక, ఈ నెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభం
Kurnool EX. MP Butta Renuka in Jagananna Vidya Kanuka Kits Program (Photo-AP CMO)

Vjy, June 9: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని, అదే రోజు దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం విజయవాడలో విద్యా శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది విద్యా కానుక కోసం రూ.1,100 కోట్లు ఖర్చు చేసిందన్నారు.

ఇందులో యూనిఫాం, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, బ్యాగ్, ఇంగ్లిష్, తెలుగు (బైలింగ్వల్‌) టెక్ట్స్‌ బుక్స్, వర్క్‌ బుక్స్, డిక్షనరీ, నోటు పుస్తకాలు అందిస్తున్నామన్నారు. పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం వైఎస్‌ జగన్‌ సోమ­వారం విద్యా కానుకను లాంఛనంగా పంపిణీ చేస్తారని తెలిపారు. అదే సమయంలో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యా కానుక కిట్ల నాణ్యతను నాలుగు దశల్లో పరిశీలించామని, ఈ ఏడాది యూనిఫాం కుట్టుకూలిని రూ.10 పెంచి రూ. 45 ఇస్తున్నామన్నారు.

ఏపీలో జూన్‌ 12 నుంచి బడులు, అకడమిక్‌ క్యాలెండర్‌ 2023–24 ను విడుదల చేసిన సీఎం జగన్, విద్యాశాఖపై రివ్యూ హైలెట్స్ ఇవిగో..

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ పది, ఇంటర్‌ పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట సత్కరించే వేడుక రాష్ట్రస్థాయిలో 20న సీఎం చేతుల మీదుగా జరుగుతుందని మంత్రి చెప్పారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను, హెచ్‌ఎంలనూ సత్కరిస్తామని చెప్పారు. 15న నియోజకవర్గ స్థాయిలో, 17న జిల్లా స్థాయిలో విద్యార్థులను సత్కరిస్తామన్నారు. వీరితో పాటు టెన్త్‌లో స్కూల్‌ ఫస్ట్‌ వచ్చిన విద్యార్థులను 12 నుంచి 19 వరకు సత్కరించనున్నట్లు తెలిపారు. మొత్తం 22,768 మంది విద్యార్థులను సత్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌లో 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు అందిస్తామన్నారు.

రాష్ట్ర విద్యార్థులు గ్లోబల్‌ ఇంగ్లిష్లో పట్టు సాధించేలా రాష్ట్రస్థాయిలోనే విద్యార్థులుకు టోఫెల్‌ శిక్షణ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ తెలిపారు. ఇందుకోసం జిల్లాకు ఇద్దరు ఉపాధ్యాయులను ప్రఖ్యాత అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీకి పంపి శిక్షణ ఇప్పిస్తామన్నారు. 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు టోఫెల్‌–ప్రైమరీ, 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు టోఫెల్‌– జూనియర్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

పాఠశాలలు ప్రారంభమైన రోజు నుంచే గోరుముద్ద పథకం అమలు చేస్తామని మధ్యాహ్న భోజన పథకం సంచాలకులు డాక్టర్‌ నిధి మీనా తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్, పాఠశాలల మౌలిక సదుపాయాల కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇంటర్మీడియట్‌ విద్య కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చదవండి: అసత్యాల్లో నిండా మునిగిన ‘ఈనాడు’

ఫెయిల్‌ అయిన వారికి మరో అవకాశం

టెన్త్, ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయడం తప్ప పాఠశాల, కాలేజీలకు వెళ్లి చదువుకునే అవకాశం ఇంతవరకు లేదు. అయితే, 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఇలాంటి విద్యార్థులకు మరో అవకాశంగా రెగ్యులర్‌గా అదే తరగతిలో మరోసారి చదువుకునే అవకాశాన్ని కలి్పస్తున్నట్టు మంత్రి బొత్స తెలిపారు. వీరికి ఒక్క ఏడాదే ఈ అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ వర్తిస్తాయని వివరించారు.