
Amaravathi, May 28: ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ కోవిడ్ పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. రోజూవారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో నిన్నటికంటే ఈరోజు సుమారు 2 వేల వరకు కేసులు తగ్గాయి. దాదాపు అన్ని జిల్లాల నుంచి కేసులు తగ్గుతున్నాయి, రికవరీలు పెరుగుతున్నాయి. అయితే ఏపిలో కోవిడ్ మరణాలు మాత్రం గత కొంతకాలంగా వందకు పైగానే నమోదవుతుండటం గమనార్హం.
రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 84,502 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 14,429 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 16,57,986కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 16,55,091గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 2,291 కోవిడ్ కేసులు నమోదు కాగా.. తూర్పు గోదావరి జిల్లా నుంచి 2,022, అనంతపూర్ జిల్లా నుంచి 1,192 అలాగే విశాఖ జిల్లా నుంచి 1,145 కేసులు వచ్చాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 103 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 10,634కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 20,746 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 14,66,990 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,80,362 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.