Murder (Photo Credits: Pixabay)

Nellore, August 7: నెల్లూరు జిల్లాలోని బోగోలు మండలం కొండబిట్రగుంటలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే ఇంట్లో ముగ్గురు కుటుంబసభ్యులను దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఆస్తి వివాదాల నేపథ్యంలో కుమారుడి ఉత్తరక్రియలు పూర్తికాకముందే మృతుడి భార్యను ఆమె మామ, అత్తింటివారు చంపేశారు. ఆమెకు తోడుగా నిద్రిస్తున్న తండ్రి, అమ్మమ్మనూ దారుణంగా హతమార్చారు.

స్థానికులు, పోలీసుల కథనం మేరకు కొండబిట్రగుంటకు చెందిన రైల్వే ఉద్యోగి మందాటి మధుసూదన్‌కు, బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన మౌనికకు(32) తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఎనిమిదేళ్ల వయసున్న కుమారుడు మన్విత్‌ ఉన్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో నాలుగేళ్ల నుంచి భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. మధుసూదన్‌ బిట్రగుంట రైల్వేస్టేషన్‌ టెలికాం విభాగంలో పనిచేస్తూ కొండబిట్రగుంటలో తల్లిదండ్రులతో కలిసి ఉంటుండగా, మౌనిక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ బెంగళూరులో ఉంటున్నారు. వీరి కుమారుడు మన్విత్‌ బుచ్చిరెడ్డిపాళెంలోని అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు.

పెళ్లి మాటెత్తిందని ట్యాంకర్ కిందకు తోసేసి హత్య.. భర్తను కోల్పోయిన యువతికి దగ్గరయ్యాక మరో మహిళతో నిందితుడి నిశ్చితార్థం.. తననే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో కడతేర్చిన వైనం.. బాచుపల్లిలో వెలుగు చూసిన ఘటన

పది రోజుల క్రితం మధుసూదన్‌(35) గుండెపోటుతో మృతిచెందగా మౌనిక తన తండ్రి కృష్ణయ్య, అమ్మమ్మ శాంతమ్మ, కుమారుడు మన్విత్‌తో కొండబిట్రగుంటకు వచ్చి అక్కడే ఉంటున్నారు. ఈక్రమంలో ఏం జరిగిందో ఏమో కానీ ఆదివారం వేకువజామున మౌనిక(32), ఆమె తండ్రి కృష్ణయ్య(65), అమ్మమ్మ శాంతమ్మ(75) ఇంట్లోనే దారుణహత్యకు గురయ్యారు. మౌనిక అత్త, మామ, మరిది ఇంటికి తాళాలు వేసి మన్విత్‌ను తీసుకుని పరారయ్యారు. ఆదివారం ఉదయం బుచ్చిరెడ్డిపాళెం నుంచి మౌనిక తల్లి ఎన్నిసార్లు ఫోన్‌చేసినా ఎవరూ ఫోన్‌ తీయకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.

మధుసూదన్‌ తండ్రి మాల్యాద్రి, సోదరుడు మౌలాలి వీరిని హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ముందు అరుపులు, కేకలతో పెనుగులాట చోటుచేసుకున్నట్లు సంఘటన ప్రదేశంలో ఆనవాళ్లనుబట్టి తెలుస్తోంది. హతుల ముఖంపై రాడ్డు, కట్టెలతో కొట్టి తీవ్రంగా గాయపరిచిన గుర్తులున్నాయని సమాచారం.నిందితులు పరారీలో ఉన్నారు. మాల్యాద్రి భార్య, మౌనిక అత్త ధనమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురి హత్య గురించి తెలియగానే జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి గ్రామానికి చేరుకున్నారు. పోలీసు జాగిలాన్ని రప్పించారు. క్లూస్‌టీం వివరాలు సేకరించింది.