Nellore, August 29: నెల్లూరు జిల్లా కేంద్రంలో ఓ జంట దారుణ హత్యకు గురైంది. దంపతులను హత్య (Couple Murdered in Nellore District)చేసిన అనంతరం దుండగులు ఇంట్లోని నగలు, నగదును అపహరించుకుపోయారు. ఈ సంఘటన నెల్లూరు పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీలో విషాదాన్ని నింపింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికు తరలించిన పోలీసులు.. క్లూస్ టీమ్‌లను రప్పించి విచారణ ప్రారంభించారు. కాలనీకి సమీపంలోని ఏఎస్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్, మినీ బైపాస్ రోడ్, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేస్తున్నారు.
ఈ హత్యలను (Couple Murdered in Nellore) ఎవరు? ఎందుకు చేశారని తెలుసుకునేందుకు పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు.. ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలం ఇందుగపల్లి గ్రామానికి చెందిన వాసిరెడ్డి కృష్ణారావు (54), వాసిరెడ్డి సునీత (50)లు దంపతులు. వారికి సాయిచంద్, గోపీచంద్ పిల్లలు. దంపతులు సుమారు 26 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికొచ్చారు. తొలినాళ్లలో కరెంటాఫీస్ సెంటర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకుంటూ అదే ప్రాంతంలో శ్రీరామ్ క్యాంటీన్ (హోటల్)ను ప్రారంభించారు.
పిల్లలను ఉన్నత చదువులు చదివించి వివాహాలు చేశారు. పెద్ద కుమారుడు పోస్టల్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు గోపీచంద్ రాంజీనగర్‌లో నివాసముంటూ పొగతోటలో మధుర హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.కాగా కృష్ణారావు పడారుపల్లి అశోక్‌నగర్ (ఏఎన్‌ఆర్ కల్యాణ మండపం సమీపంలో) డూప్లెక్స్ హౌస్‌ను నిర్మించాడు. ఆరేళ్లుగా భార్యతో కలిసి అక్కడ నివాసముంటున్నాడు.
అదే ప్రాంతానికి చెందిన పాల వ్యాపారి రమణమ్మ రోజూ ఉదయం కృష్ణారావు దంపతులకు పాలు పోసేది. ఎప్పటిలాగే రమణమ్మ ఆదివారం ఉదయం పాలు పోసేందుకు వెళ్లింది. వరండాలో కృష్ణారావు మృతిచెంది ఉండడాన్ని గమనించిన ఆమె కేకలు వేస్తూ అక్కడి నుంచి వీధిలోకి పరుగులు తీసింది. స్థానికులకు ఈ విషయాన్ని తెలియజేసింది. వారు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నగర ఇన్‌చార్జి డీఎస్పీ అబ్దుల్ సుభాన్, వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్ కె.నరసింహారావు తన సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. స్థానికుల ద్వారా పడారుపల్లిలో నివాసముంటున్న కృష్ణారావు అన్న సుధాకర్‌రావుకు సమాచారం అందించారు. ఆయన ద్వారా మృతుడి కుమారుడు గోపీచంద్‌కు విషయం చెప్పారు. ఘటనా స్థలంలో ఎక్కడ చూసినా రక్తపుమడుగులే దర్శనమిచ్చాయి.
కృష్ణారావు స్కూటీని ఇంటి బయట పార్క్ చేసి లోనికి వచ్చే సమయంలో వరండాలో హతమార్చారు. మృతుడి జేబులోనో.. చేతులోనో ఉండాల్సిన బైక్ తాళాలు కప్‌బోర్డులో ఉండడాన్ని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇంటిపై గదిలోని బీరువాలో హోటల్‌కు సంబంధించిన రోజువారి కలెక్షన్, ఆస్తికి సంబంధించిన విలువైన పత్రాలు ఉంచుతారని బంధువులు పేర్కొన్నారు. కింద పడకగదిలోని బీరువాలో బంగారు ఆభరణాలుంటాయి. దాన్ని పగులగొట్టేందుకు దుండగులు యత్నించారు.
అయితే సాధ్యం కాకపోవడంతో పైగదిలోని బీరువాను పగులగొట్టారు. అందులో ఉన్న నగదు మాత్రమే అపహరించారా? డాక్యుమెంట్లనూ తీసుకెళ్లారా? అనే అంశాలపై స్పష్టత లేదు. హత్యలు దోపిడీలో భాగమేనని అందరూ భావిస్తున్నా ఇతర కారణాలున్నాయా? అన్న కోణంలో సైతం పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఘటనా స్థలాన్ని ఎస్పీ సీహెచ్ విజయారావు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హత్య కేసు ఛేదించాలని ఆదేశించారు. నగర ఇన్‌చార్జి డీఎస్పీ, సీసీఎస్ డీఎస్పీలు అబ్దుల్ సుభాన్, శివాజీరాజ్‌ల పర్యవేక్షణలో వేదాయపాళెం, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌లు కె.నరసింహారావు, గంగాధర్‌లు తమ సిబ్బందితో కలిసి విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. హత్య జరిగిన ఇంటి నుంచి పోలీసు జాగిలం సమీపంలోని ఖాళీ స్థలం వరకు వెళ్లి వెనుదిరిగింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు చేయగా రక్తపుమరకలతో ఉన్న కత్తి, సవకకర్రను, అపహరణకు గురైన రెండు సెల్‌ఫోన్లలో ఒక దానిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు ప్రణాళికతోనే హత్య జరిగిందా? దంపతులకు తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.