
Visakhapatnam, January 3: ఏపీలోని విజయనగరం జిల్లాలో కొత్త సంవత్సరం వేడుకల వేళ దారుణం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన బాలికలపై ఓ రౌడీషీటర్ (Andhra Pradesh Shocker) కన్నేశాడు. పోలీస్‌నంటూ బెదిరింపులకు దిగి ఇద్దరు బాలికలపై లైంగిక దాడి యత్నానికి (Fake Policeman Rapes Two Minor Girls ) తెగబడ్డాడు. ఈ దారుణ ఘటన కురుపాంలో చోటుచేసుకుంది.
కురుపాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కురుపాం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ పోస్ట్‌మెట్రిక్ బాలికల వసతిగృహంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ, హెచ్‌ఈసీ గ్రూపులు చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు.. తమ స్నేహితులతో కలిసి జియ్యమ్మవలస మండలంలోని వట్టిగెడ్డ రిజర్వాయర్‌ను చూసేందుకు శనివారం వెళ్లారు. తిరిగి కాలినడకన వసతిగృహానికి పయనమయ్యారు. సాయంత్రం 3 గంటల సమయంలో చినమేరంగికి చెందిన వెలగాడ రాంబాబు అనే వ్యక్తి విద్యార్థినులు, వారి స్నేహితులను అడ్డగించాడు. తను పోలీసునంటూ బెదిరించాడు.
చెప్పినట్టు వినకపోతే మీ ఫొటోలు సోషల్‌మీడియా, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. ఇద్దరు విద్యార్థులను దూరంగా పంపించేసి... బాలికలను సమీపంలోని పామాయిల్‌తోటకు తీసుకెళ్లాడు. ఒకరి తరువాత ఒకరిపై లైంగికదాడికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానంటూ భయపెట్టాడు. ఘటన అనంతరం కన్నీరు మున్నీరు పెట్టుకుంటూ వసతిగృహానికి చేరుకున్న విద్యార్థినులు విషయాన్ని వసతిగృహ సంక్షేమాధికారిణి మండంగి సీతమ్మకు తెలియజేశారు.
ఆమె వెంటనే కురుపాం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎల్విన్‌పేట సీఐ తిరుపతిరావు, కురుపాం ఎస్‌ఐ బి.శివప్రసాద్‌లు వసతిగృహానికి చేరుకున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. పార్వతీపుపురం డీఎస్పీ సుభాష్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే వసతిగృహానికి చేరుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇద్దరు బాలికలను వైద్య పరీక్షలకు పంపిస్తామని చెప్పారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితుడు రాంబాబుపై ఇప్పటికే చినమేరంగి పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి. రౌడీషీట్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.