Gurramkonda, May 22: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పొలంలో గొర్రెలు మేపుకుంటున్న మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కత్తి చూపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ప్రతిఘటించడంతో కత్తితో గుండెల మీద కోసి తీవ్రంగా గాయపరిచాడు. బాలిక కేకలు విని పరిసరాల్లో ఉన్నవారు అక్కడికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.ఈ దారుణ ఘటనపై గ్రామస్తులు కోపంతో నిందితుడిపై దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.
మదనపల్లె పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలానికి చెందిన ఓ బాలిక (13) జడ్పీ ఉన్నత పాఠశాల్లో చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఆవులు మేపడానికి పొలంలోకి వెళ్లింది. అదే గ్రామానికి చెందిన ఉత్తన్న (43) అనే వ్యక్తి ఆమెకు కత్తి చూపి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలిక ప్రతిఘటించడంతో గుండెలపై కత్తితో కోశాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన బాలిక కేకలు వేయడంతో పరిసరాల్లోని రైతులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని చూసిన నిందితుడు పరిగెత్తాడు. బాలికను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయం గ్రామమంతా తెలియడంతో అందరూ ఉత్తన్నపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు రెండు కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగేంద్ర చెప్పారు.బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు ఉత్తన్న (43) గతంలో తన భార్యను చంపిన కేసులో ఏడేళ్లు రాజమహేంద్రవరం జైలులో శిక్ష అనుభవించి రెండేళ్ల క్రితం విడుదలైనట్లు గ్రామస్థులు చెప్పారు. అలాగే ఏడాది క్రితం కుమార్తెను చంపి, అనారోగ్యంతో మృతిచెందినట్లు స్థానికులను నమ్మించాడని స్థానికులు తెలిపారు.