Amaravati, September 12: గుంటూరు జిల్లాలో రెండు రోజుల క్రితం దారుణ ఘటన చోటు చేసుకున్న సంగతి విదితమే. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు.. గుంటూరు నగరంలో ఓ వివాహానికి హాజరై బైక్‌పై తిరిగి వెళ్తుండగా.. మేడికొండూరు క్రాస్ రోడ్ సమీపంలో దుండగులు అడ్డగించి భర్తపై దాడి చేశారు. అనంతరం భార్యను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి (Woman Gang Raped in Guntur) పాల్పడ్డారు. ఈ గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను అటకాయించి.. భర్తను చెట్టుకు కట్టేసి అతని కళ్లెదుటే భార్యపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నిందితుల కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు (huge Police team Searching for Accused) గాలిస్తున్నాయి. సత్తెనపల్లి, మేడికొండూరు, గుంటూరు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. మేడికొండూరు పోలీసులు పాతనేరస్తులెవరినీ విడిచిపెట్టకుండా విచారణ చేస్తున్నారు. పాలడుగు అడ్డరోడ్డు ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న కోల్డ్‌స్టోరేజీలో పని చేసున్న 70 మంది కార్మికులను ఇప్పటికే విచారణ చేశారు.
పలు నేరాల్లో నిందితులుగా ఉన్న వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న 8 మందిని మూడు రోజులుగా విచారణ చేస్తున్నారు. వారి నుంచి ఎటువంటి సమాచారం లభ్యం కాలేదని తెలుస్తోంది. ఘటనా స్థలంలో కొత్తగా తిరుగుతున్న అనుమానితులనూ గుర్తించి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా ఎవరినీ విడిచి పెట్టకుండా దర్యాప్తు సాగిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఆ మార్గంలోని సీసీ ఫుటేజ్‌లను నిశితంగా పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.