CM Jagan (Photo-APCMO/X)

Vjy, Dec 15: సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం (Andhra Pradesh state cabinet meeting) ముగిసింది. అమరావతిలోని సచివాలయంలో గల మొదటి బ్లాక్‌లోని కేబినెట్‌ సమావేశ మందిరంలో కేబినెట్‌ భేటీ అయ్యింది. పలు కీలక అంశాలపై (AP Cabinet Meeting Highlights)చర్చించారు. కేబినెట్‌ భేటీలో మొత్తం 45 అంశాలపై చర్చించారు. మిచౌంగ్‌ తుపాను బాధితులకు నష్ట పరిహారం అందించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పెన్షన్‌ రూ. 3 వేలకు పెంపు నిర్ణయానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

సీఎం జగన్‌తో మిచౌంగ్‌ తుపాను కేంద్ర బృందం భేటీ,పంట నష్టంపై సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని వెల్లడి

సీఎం జగన్ తో పాటు మంత్రివర్గ సభ్యులు ఈ కీలక సమావేశానికి హాజరయ్యారు. మరి కొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేటి కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ, 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, సర్వసన్నద్ధంగా ఉండాలని మంత్రులకు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి వరకు మంత్రులు పర్యవేక్షిస్తుండాలని నిర్దేశించారు.

కేబినెట్ సమావేశం వివరాలు ఇవే...

జనవరి నుంచి సామాజిక పెన్షన్లు రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంపు నిర్ణయానికి ఆమోదం

ఆరోగ్యశ్రీ చికిత్స మొత్తం పరిమితి రూ.25 లక్షలకు పెంపునకు ఆమోదం

జనవరిలో చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల అమలుకు ఆమోదం

జనవరిలో ప్రారంభమయ్యే జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమానికి ఆమోదం

మిగ్జామ్ తుపాను పరిహారం, కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఆమోదం

విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్ కు ఆమోదం

విశాఖలో ఓ ప్రైవేటు విద్యాసంస్థకు 11 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు నిర్ణయానికి ఆమోదం

వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పజతకం అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం

రాష్ట్రంలోని 11 మెడికల్ కాలేజీల్లో యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల ఏర్పాటు, సిబ్బంది నియామకానికి ఆమోదం

కోర్టుల సిబ్బంది, పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ, డీఆర్ చెల్లింపులపై చర్చ

యాంటీ నక్సల్ ఆపరేషన్లలో పాల్గొనే వారికి 15 శాతం భృతి పెంపు నిర్ణయానికి ఆమోదం

110 భూ కేటాయింపుల వ్యవహారాలు ఏపీఐఐసీకి అప్పగించడంపై చర్చ

రాష్ట్ర సీసీ టీవీ నిఘా ప్రాజెక్టు కోసం బ్యాంకు నుంచి రూ.552 కోట్ల రుణం తీసుకోవడంపై చర్చ

కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలపై చర్చ

ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలపై చర్చ

ఎన్నికల నిర్వహణ కోసం అదనంగా 982 పోస్టులు సృష్టించాలని నిర్ణయం