Chandra babu (Photo-Twitter)

Nandigama, Nov 4: ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో చంద్రబాబు రోడ్ షో కొనసాగింది. చంద్రబాబు మాట్లాడుతూ..వైసీపీ నేతల (YCP Leaders)పై ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu) విమర్శలు గుప్పించారు. వైసీపీ రౌడీలకు భయపడేదే లేదని చంద్రబాబు హెచ్చరించారు. జగన్‌రెడ్డి.. పులివెందుల రాజకీయాలు చేయవద్దని, ఏపీని సీఎం జగన్‌రెడ్డి నాశనం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. జగన్‌రెడ్డి నీ ఆటలు సాగవు.. నిన్ను సాగనంపే రోజు వచ్చిందని, ఏపీ భవిష్యత్తే టీడీపీ ధ్యేయమని చంద్రబాబు అన్నారు. జగన్‌రెడ్డివి నవరత్నాలు కాదని,.. నవద్రోహాలు అని చంద్రబాబు ఆరోపించారు.

జగన్‌రెడ్డి సర్కార్‌ ఇచ్చేది గోరంత.. దోచుకునేది కొండంత, వైసీపీ హయాంలో ఇసుక కుంభకోణం జరిగిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేబ్రాండ్స్‌ పేరుతో జగన్‌రెడ్డి భారీగా దోపిడీ చేశాడని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సీఐడీ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల ఇళ్లపైకి పోలీసులు దాడులకు వస్తున్నారని, చట్టాన్ని ఉల్లంఘించే పోలీసులను వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమని చంద్రబాబు అన్నారు.

ఏపీలో రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్‌ ఏర్పాటు, గుమ్మళ్ళదొడ్డి వద్ద బయో ఇథనాల్‌ యూనిట్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం జగన్

విధ్వంసం, విభజన వైసీపీ సర్కార్‌ నైజమని,3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా? అని చంద్రబాబు ప్రశ్నించారు. వేలాది ఎకరాలను దోచుకుంటూ కొండలను తవ్వేస్తున్న వైసీపీ నేతలను ఏం చేయాలి? అని చంద్రబాబు అన్నారు. పోలీసుల పహారాలో ముద్దుల సీఎం తిరుగుతున్నారని, జగన్‌రెడ్డి మంత్రులందరూ బూతుల మంత్రులే అని చంద్రబాబు విమర్శించారు. ఏపీలో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని, ఏపీలో టీచర్లు, ఉద్యోగులు భయంతో బతుకుతున్నారని చంద్రబాబు అన్నారు. అవినీతి డబ్బులు లెక్కపెట్టుకోవడంలోనే జగన్‌రెడ్డి బిజీ, వైసీపీ రౌడీలను త్వరలోనే అణచివేస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

ఇక ‘బాదుడే బాదుడు’ నిరసన రోడ్‌షో నిర్వహిస్తున్న సమయంలో చంద్రబాబుపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఈ ఘటనలో చంద్రబాబు పక్కనే ఉన్న ఆయన ప్రధాన భద్రతా అధికారి మధుబాబుకి గాయమైంది. మధుబాబు గడ్డం కింద గాయమై రక్తస్రావం కావడంతో వెంటనే వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. రాయి విసిరిన ఘటనతో ఎన్‌ఎస్‌జీ కమాండోలు అప్రమత్తమయ్యారు. 12 మంది బృందంతో భద్రత కట్టుదిట్టం చేశారు. రోడ్‌షో త్వరగా ముగించాలని పోలీసులు ఒత్తిడి చేశారు. చంద్రబాబు వాహనం ముందు, వెనుక పెద్ద ఎత్తున రోప్‌ పార్టీలు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా చంద్రబాబు వాహనం చుట్టూ అదనపు భద్రతాదళాలు మోహరించాయి.