Road accident (image use for representational)

Amaravati, Oct 10: ప్రకాశం జిల్లా కనిగిరిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొత్తగా కొన్న కారుకు పూజ చేయించేందుకు వెళ్తుండగా మార్గం మధ్యలో మలుపు వద్ద కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడు, కుమార్తె దుర్మరణం (Three People died in Road Accident in kanigiri) చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కనిగిరికి చెందిన కుందురు రామిరెడ్డికి కుమార్తె కల్యాణి, కుమారుడు కృష్ణ చైతన్య ఉన్నారు. కనిగిరికే చెందిన పి.వరుణ్‌తో కల్యాణికి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 8 నెలల బాబు నాగ ఆద్యంత్‌రెడ్డి ఉన్నాడు. వీరిద్దరూ ఉద్యోగం చేసుకుంటూ లండన్‌లో ఉంటున్నారు.

కాగా మూడు నెలల క్రితం కనిగిరికి వచ్చారు. ఈ క్రమంలో 12 రోజుల క్రితం రామిరెడ్డి కొత్త కారు కొన్నారు. కారుకు పూజలు చేయించేందుకు రామిరెడ్డి, అతని భార్య మహేశ్వరి, కుమారుడు కృష్ణ చైతన్య, కుమార్తె కల్యాణి, మనవడు నాగ ఆద్యంత్‌రెడ్డిలతో కలిసి కడప జిల్లా పోరుమామిళ్లలోని గుడికి బయల్దేరారు. బయల్దేరిన కొద్దిసేపటికే మార్గం మధ్యలో కనిగిరి మండలం నారపరెడ్డిపల్లి మలుపు వద్ద అతివేగం వల్ల కారు అదుపు తప్పి ప్రమాద సూచిక స్తంభాన్ని ఢీకొట్టి పల్టీలు కొట్టింది.

తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్తూ..ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, 5 మందికి గాయాలు, అందరూ ఐబీఎంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే

ఈ దుర్ఘటనలో కల్యాణి (34) అక్కడికక్కడే మృతిచెందగా, కారు నడుపుతున్న కృష్ణచైతన్య (30) కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిగిరి ప్రభుత్వాస్పత్రిలో మృతిచెందాడు. రామిరెడ్డి (60)కి తీవ్ర గాయాలవడంతో ఒంగోలుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. చిన్నారి నాగ ఆద్యంత్‌రెడ్డి, మహేశ్వరి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదు రోజుల క్రితమే అల్లుడు పి.వరుణ్‌ లండన్‌కు వెళ్లాడు. ప్రమాద విషయం తెలియగానే తిరుగు ప్రయాణమయ్యాడని బంధువులు తెలిపారు. ఒకే ఇంట్లో ముగ్గురు మృతిచెందడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.