Amaravati, April 28: గురువారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్‌లో పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల అధికారులతో మంత్రి రోజా ( Tourism Minister Roja Review Meeting) సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని కళాకారులకు గుర్తింపు కార్డులు అందించేందుకు నిర్ణయించినట్లు ఏపీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖల మంత్రి రోజా (Tourism Minister Roja) చెప్పారు. కళాకారులను ఎవ్వరినీ వదిలిపెట్టకుండా అందరినీ ప్రోత్సహించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విదేశీ పర్యాటకులను పరిచయం చేసేందుకు తానే ప్రత్యేక అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను నిత్యం సందర్శించడం ద్వారా అక్కడి సమస్యలను తెలుసుకుంటానని, ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి రోజా తెలిపారు. రాష్ట్రంలో పర్యాటర రంగ అభివృద్ధికి ఇప్పటికే ప్రారంభించిన వివిధ ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని కళాకారులకు గుర్తింపు కార్డులు అందివ్వడానికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించి జిల్లా కలెక్టర్లకు తెలియజేయాలని మంత్రి రోజా సూచించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధితోపాటు క్రీడలు, క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకంటామని చెప్పారు.