VJY, May 31: టీడీపీ ఎంపీ కేశినేని నాని దూకుడు టీడీపీలో అగ్గిరాజేస్తోంది.తాజాగా విజయవాడ ఎంపీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధిష్టానానికి కేశినేని నాని పరోక్షంగా సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై స్పందిస్తూ.. ఎంపీగా టీడీపీ... ఏ పిట్టల దొరకు టికెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని అన్నారు. తను ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రజలు కోరుకుంటే గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
తన మాటలను పార్టీ ఎలా తీసుకున్నా తనకు భయం లేదని కేశినేని నాని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో పార్టీలతో సంబంధం లేదని అన్నారు. ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకేనని పేర్కొన్నారు.
కాగా టీడీపీ తరపున విజయవాడ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు ఎంపీ కేశినేని నాని. అయితే 2019లో రెండోసారి గెలిచిన తరువాత ఆయనకు పార్టీకి మధ్య వివాదాలు తలెత్తాయి. దీంతో టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న కేశినేని నాని సమయం దొరికినప్పుడల్లా తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మొన్న నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావుతో కలిసి కనిపించిన కేశినేని నాని, తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.నేను కరెక్టా…రాంగ్ అనేది నాకు తెలుసు. నాకు పార్టీ పట్ల విధేయత ఉందో లేదో నాకు తెలుసు. నాకు పార్టీ టిక్కెట్ ఇస్తుందా లేదా…ఎంపీ అవుతానా లేదా అనే బాధ లేదు. నేను చేసిన అభివృద్ధి ఇంకెవరూ చేయలేదు. ఇక్కడ రెండు ఫ్లాట్ ఫామ్‌లు మాత్రమే ఉన్నాయి. పార్టీలు లేవు. వైసీపీకి జగన్, మాకు చంద్రబాబు నాయకులు. వాళ్ళిద్దరే విరోధులు…ఇంకెవరూ విరోధులు కాదు” అని కేశినేని నాని పేర్కొన్నారు.
ఇటీవల నందిగామ వచ్చిన కేశినేని నాని వైసీపీ ఎమ్మెల్యేపై పొగడ్తల వర్షం కురిపించారు. రాజకీయ వైరం మర్చిపోయి వైసీపీ, టీడీపీ ప్రజాప్రతినిధులు కితాబులిచ్చుకోవడం జనాల్ని ఆశ్చర్యపరిస్తే.. నందిగామ తెలుగు తమ్ముళ్లకు సర్రున కాలింది. లోకల్‌గా వైసీపీ ఎమ్మెల్యేతో ఢీ అంటే ఢీ అని పోరాటం చేస్తుంటే టీడీపీ ఎంపీ కేశినేని నాని వచ్చి అదే అధికారపార్టీ శాసనసభ్యుడికి గుడ్ కాండెక్ట్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో మండల టీడీపీ నాయకులు సమావేశమై నానిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు కూడా. కేశినేని నానికి వ్యతిరేకంగా నందిగామ టీడీపీ ఫేస్‌బుక్ పేజీలో పోస్టింగ్స్ నిండిపోయాయి.