VJY, Oct 10: ఏపీలో ఏడేళ్ల బాలికపై లైంగికదాడి చేసిన వ్యక్తికి జీవితకాలం కఠిన కారాగార శిక్ష (మరణించే వరకు జైలు) ( Sentenced imprisonment till death) విధిస్తూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పోక్సో కోర్టు (Vijayawada POCSO Court) న్యాయమూర్తి రజిని సోమవారం తీర్పు ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా నున్నకి చెందిన బాలిక(7) ఈ ఏడాది ఫిబ్రవరి 26న స్కూలుకు వెళ్లి వచ్చి ఇంటి వద్ద ఆడుకుంటూ ఉంది. ఆ ఇంటి సమీపంలోనే ఉంటున్న అనీల్(30) అనే కామాంధుడు ఆ బాలికకు నెమలి ఈకలు ఇస్తానని ఆశ చూపి తాను పని చేస్తున్న టెంట్ హౌస్‌కు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
అనీల్ అత్యాచారం చేశాడని ఆ బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె నున్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి కేసును దిశా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దిశా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి పై విధంగా శిక్ష, రూ.3 వేలు జరిమానా విధించారు. బాలిక కుటుంబానికి రూ.5 లక్షలు నష్టపరిహారం అందేలా చూడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆదేశించారు.