VJY, Dec 12: ఏపీలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. తను వద్దన్నా పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మనస్తాపంతో సచివాలయ ఉద్యోగి (Village Secretariat employee ) గొర్లె వరుణ్‌కుమార్ తన ఇంట్లో శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు (commits suicide in Anantapur) పాల్పడ్డాడు. అనంతపురం జిల్లాలోని దేవరాపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అతని కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
గొర్లె వరుణ్‌కుమార్ (31) ఇదే మండలంలోని వేచలం గ్రామ సచివాలయంలో జూనియర్ లైన్‌మేన్‌గా మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే కుమారుడికి వివాహం చేయాలన్న ఆలోచనతో తల్లి పైడితల్లమ్మ, మేనమామ అల్లు కరువునాయుడు, బంధువులు వరుణ్‌కుమార్‌కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే కొంతకాలం పెళ్లి సంబంధాలు చూడొద్దని వరుణ్‌కుమార్ తేల్చిచెప్పాడు.
అయినా కుటుంబసభ్యులు వినకుండా తనకు సంబంధాలు చూస్తుండడంతో అతను మనస్తాపం చెందాడు. శనివారం ఉదయం స్నానం చేసి వస్తానని చెప్పి ఇంటి రెండో అంతస్తులో గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. వరుణ్‌కుమార్ ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. అయితే అతను ఫోన్ ఎంతకీ తీయకపోవడంతో గది తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి శ్లాబ్ హుక్కుకి తాడుతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు.
దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న తల్లిదండ్రులు కొడుకును విగతజీవిగా చూసి శోక సంద్రంలో మునిగిపోయారు. మృతుడి తల్లి పైడితల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ తాతారావు, ఎ.కోడూరు ఎస్‌ఐ లోకేశ్వరరావు మృతుడి ఇంటికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. వరుణ్ కుమార్ మృతి చెందాడన్న విషయం తెలుసుకొని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు దేవరాపల్లికి చేరుకొని మృతదేహం వద్ద నివాళులర్పించారు. మృతుడి తల్లి పైడితల్లమ్మ, మేనమామ అల్లు నాయుడు తదితర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. మృతదేహానికి అనకాపల్లిలో పోస్టుమార్టం నిర్వహించి త్వరగా పంపించాలని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్‌లో డిప్యూటీ సీఎం ఆదేశించారు.