Nellore, Mar 28: ఏపీ సీఎం జగన్ నెల్లూరులో పర్యటించారు. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్‌మెహన్ రెడ్డి ఓదార్చారు. అనంతరం గౌతమ్ రెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి సీఎం నివాళులు అర్పించారు. గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభకు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డిపై అభిమానంతో ఆయన చిత్ర పటాలతో ఇంతియాజ్ అనే దివ్యాంగుడు.. భగవద్గీతను తయారు చేశాడు. సంస్మరణ సభలో గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్ది చేతుల మీదుగా సీఎం వైఎస్ జగన్‌మెహన్ రెడ్డికి ఆ భగవద్గీతను అందించారు.
సీఎం జగన్ మాట్లాడుతూ.. గౌతమ్ రెడ్డి మన మధ్య లేడనే వార్త చాలా కష్టంగా ఉంది. తాను ఇక లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి గౌతమ్ నాకు మంచి స్నేహితుడు. ప్రతీ అడుగులో నాకు తోడుగా ఉన్నాడు. గౌతమ్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం చెప్పలేనిది. రాజకీయాల్లోకి తనను నేను తీసుకువచ్చాను. రాజకీయాల్లో ఇద్దరం మంచి స్నేహితులుగా ఉన్నాం. వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ గౌతమ్ రెడ్డి కుటుంబానికి తోడుగా ఉంది.
గౌతమ్ రెడ్డి ఏపీ మంత్రి వర్గంలో పరిశ్రమల శాఖ సహా ఆరు శాఖలను నిర‍్వహించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఆయన చివరి క్షణం వరకు కృషి చేశారు. గౌతమ్ రెడ్డి ప్రతీ అంశంలోనూ నన్ను ప్రోత్సహించారు. మే 15 వరకు సంగం బ్యారేజీని పూర్తి చేసి.. గౌతమ్ రెడ్డి గౌరవార్ధం ఆ బ్యారేజీకి ఆయన పేరును పెడతాం. దివంగత గౌతం తండ్రి మాట్లాడుతూ.. ముందు నుండి వైఎస్‌ఆర్ కుటుంబం తమకు అండగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్‌మెహన్ రెడ్డికి తన కుటుంబం కృతజ్ఞతలు తెలుపుతోందని ఈ సందర్భంగా తెలిపారు. తమ కుటుంబపై చూపిన ప్రేమకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.