Andhra Pradesh: వివిధ జైళ్ల నుంచి 162 మంది ఖైదీలు విడుదల, 195 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
AP Government logo (Photo-Wikimedia Commons)

Amaravati, August 16: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ( YS Jagan Government) క్షమాభిక్ష ప్రసాదించడంతో రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి పలువురు ఖైదీలు సోమవారం విడుదలయ్యారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, కడప, అనంతపురం, ఒంగోలు కారాగారాల నుంచి 162 మంది విడుదలై స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. విడుదలైన వారిని వారి బంధువులు సంతోషంగా తమవెంట తీసుకెళ్లారు.

వివిధ కారాగారాల నుంచి 195 మంది ఖైదీలను (release of 195 prisoners ) విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హరీష్‌కుమార్‌ గుప్తా ఆదివారం ఆదేశాలు జారీచేశారు. వీరిలో 175 మంది జీవితఖైదీలు, 20 మంది ఇతర శిక్షలు పడినవారు ఉన్నారు. ఈ 195 మందిలో 13 మంది మహిళలున్నారు. కొన్ని కారణాలవల్ల కొందరు సోమవారం విడుదల కాలేదు.

స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా, స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి 66 మంది ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో 48 మంది జీవితఖైదు పడినవారు, ఏడుగురు పదేళ్లలోపు శిక్ష పడినవారు ఉన్నారు. ఇక్కడి మహిళా జైలు నుంచి 11 మంది విడుదలకు అర్హులు కాగా.. ఎనిమిది మంది విడుదలయ్యారు. ఒకరు ముందే బెయిల్‌పై విడుదలకాగా, ఇద్దరిని విశాఖపట్నం జైలుకు మార్చడంతో అక్కడ నుంచి విడుదలయ్యారు. వీరందరికీ జీయర్‌ ట్రస్ట్‌ వారు దుస్తులు, న్యాయవాది రవితేజ స్వీట్‌బాక్సులు పంచారు.

ఇక విశాఖపట్నం కేంద్ర కారాగారం నుంచి 41 మంది ఖైదీలు విడుదలయ్యారు. వారిలో 34 మంది జీవిత ఖైదీలు, ఏడుగురు ఇతర శిక్షలు పడినవారు ఉన్నారు. వైఎస్సార్‌ జిల్లా కడప కేంద్ర కారాగారం నుంచి 33 మంది విడుదలయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. విడుదలైన ఖైదీలను వారి బంధువులు టెంకాయలు, హారతితో దిష్టితీసి తమవెంట తీసుకెళ్లారు.

అనంతపురం జిల్లాలో 15 మంది ఖైదీలు విడుదలయ్యారు. ఇక్కడి రెడ్డిపల్లి ఓపెన్‌ ఎయిర్‌ జైలు నుంచి 14 మంది ఖైదీలను, జిల్లా జైలు నుంచి ఒకరిని ప్రభుత్వం విడుదల చేసింది. ఒంగోలు జిల్లా జైలు నుంచి ఏడుగురు జీవితఖైదీలు విడుదలయ్యారు.