Andhra Pradesh: చిన్నారికి అండగా నిలిచిన సీఎం జగన్, గాకర్స్‌ బారిన పడిన హనీకి తొలి ఇంజెక్షన్‌ ఇచ్చిన వైద్యులు, పాప చికిత్స కోసం రూ. కోటి కేటాయించిన ఏపీ ప్రభుత్వం
YS Jagan Govt Sanctions Rs 1 Cr For Treatment Of Child Suffering From Gaucher's Disease (Photo-Video Grab)

Amaravati, Oct 3: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేశ్వరానికి చెందిన మూడేళ్ల కొప్పాడి హనీ.. కాలేయానికి సంబంధించిన అరుదైన వ్యాధి గాకర్స్‌ ( Child Suffering From Gaucher's Disease) బారిన పడిన సంగతి విదితమే. ఈ విషయం తెలుసుకున్న సీఎం జగన్ చిన్నారికి అండగా నిలిచారు. ఆమెకు సోకిన అరుదైన వ్యాధి వైద్యానికి లక్షలాది రూపాయల ఖర్చును జీవితాంతం భరిస్తానని భరోసా ఇచ్చారు.చిన్నారి వైద్యానికి సీఎం జగన్‌ రూ.కోటి (YS Jagan Govt Sanctions Rs 1 Cr ) కేటాయించారని అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

సీఎం ఆదేశాల మేరకు చిన్నారి వైద్యానికి తొలి విడతగా రూ.10 లక్షల విలువైన 13 ఇంజెక్షన్లను అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక ముందు కూడా దాదాపు రూ.40 లక్షలతో మరో 52 ఇంజెక్షన్లు తెప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రిలో కలెక్టర్‌ సమక్షంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్‌ పద్మశ్రీరాణి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి భరతలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకరరావులు.. హనీకి ఆదివారం ఉదయం తొలి ఇంజెక్షన్‌ చేశారు. బాలిక తల్లిదండ్రులకు కలెక్టర్‌ శుక్లా ధైర్యం చెప్పారు. చదువుతో పాటు పౌష్టికాహారం, పెన్షన్‌ను కూడా ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. చిన్నారికి ప్రభుత్వం సరఫరా చేసిన మందుల కిట్‌ను వారికి అందించారు.

సీఎం జగన్ జేబులో పెన్ను తీసుకున్న బాలుడు, వెంటనే తన పెన్‌ గిఫ్ట్‌గా ఇచ్చి ఆశీర్వ‌దించిన ఏపీ ముఖ్యమంత్రి, సోషల్ మీడియాలో వీడియో వైరల్

హనీకి వచ్చిన కాలేయ సంబంధిత గ్రాకర్‌ వ్యాధి అత్యంత అరుదైనది. దేశంలో ఈ తరహా బాధితులు 14 మందే ఉండగా.. రాష్ట్రంలో హనీ తొలి బాధితురాలు. కాలేయ పనితీరులో జరిగే ప్రతికూల పరిస్థితులు, జన్యుపరమైన లోపాల వల్ల ఈ అరుదైన వ్యాధి సోకుతుంది. లివర్‌ హార్మోన్ల రీప్లేస్‌మెంట్‌ థెరపీ ద్వారా చిన్నారికి వైద్యం అందిస్తున్నారు. లివర్‌లో ఉండే ఎంజైమ్‌ బీటా గ్లూకోసైడేజ్‌ లోపించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. వీరికి జీవితాంతం వైద్యం అవసరం. అయితే హనీ చిన్న వయస్సులో ఉన్నందున పదేళ్ల పాటు ప్రతి నెలా రెండు ఇంజెక్షన్ల చొప్పున ఇస్తే.. ఆరోగ్యం కుదుట పడే అవకాశముందని వైద్యులు భావిస్తున్నారు.

కాగా గత జూలై 26న సీఎం జగన్‌ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు వచ్చారు. లంకల్లో వరద పరిస్థితులను పరిశీలించాక పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు కాన్వాయ్‌తో వెళుతున్నారు. ‘సీఎం గారూ.. మా పాపకు వైద్యం అందించండి’ అనే అభ్యర్థనతో ప్లకార్డు పట్టుకుని.. హెలిప్యాడ్‌ సమీపాన కుమార్తెతో కలిసి తల్లిదండ్రులు నిలుచున్నారు. ఆ ప్లకార్డు చూసి ఆగిన సీఎం జగన్‌.. ఆ చిన్నారి వ్యాధి గురించి విని చలించిపోయారు. పాప ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చయినా జీవితాంతం వైద్యం చేయిస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లాను ఆదేశించారు.