Amaravati, Sep 15: ఏపీ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం (YS Jagan Govt ) తీపి కబురు అందిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ–స్కూటర్)లను వాయిదాల పద్ధతిలో (e-bikes to govt employees on EMI) అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రతి రోజూ కార్యాలయానికి వెళ్లి రావడం, ఇతర పనుల మీద ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న వారిలో ఉద్యోగులు ఎక్కువ శాతం ఉంటున్నారు.అదీ కాకుండా పెరుగుతున్న పెట్రోలు ధరలతో ఈ సామాన్య, మధ్య తరగతి వేతన జీవులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది.
వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు వాహన కాలుష్యాన్ని అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ–స్కూటర్లు అందించే దిశగా అడుగులు వేస్తోంది. తొలుత ప్రభుత్వ ఉద్యోగులకు వీటిని అందించనుంది. కొనుగోలు చేసిన ఈ–స్కూటర్లకు ఒకేసారి కాకుండా 60 నెలల పాటు వాయిదాల పద్ధతిలో (ఈఎంఐ) డబ్బులు చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలో పని చేసే ఉద్యోగులు సైతం ఈ–స్కూటర్లు కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఆ సంస్థ నిర్వాహకుడు (మేనేజర్, సీఈఓ తదితర) సదరు ఉద్యోగి నుంచి ప్రతి నెలా ఈఎంఐ చెల్లించేందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఇందుకు అవసరమైన ప్రణాళికలను ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్) అధికారులు సిద్ధం చేశారు.