Vjy, June 06: ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అతి కొద్దిమంది వైఎస్సార్సీనీ నేతలు మాత్రమే మీడియా ముందుకొచ్చారు, ధైర్యంగా మాట్లాడారు. ఓటమిని కొందరు స్వాగతిస్తే, మరికొందరు నెపం ఈవీఎంలపైకి నెట్టేశారు. సాక్షాత్తూ జగన్ కూడా ఓటమి తనకు ఆశ్చర్యం కలిగించిందని, సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా వేసిన ఓట్లు ఏమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు ఓటమికి అసలు కారణాలు వెదకడం మొదలు పెట్టారు నేతలు. ఈ క్రమంలో జగన్ ఇంట్లో తొలి మీటింగ్ మొదలైంది. సీఎం పదవికి జగన్ రాజీనామా, రాష్ట్రంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం
వైసీపీ ఓటమికి కారణాలు ఏంటి..? ప్రజల్ని మనం తప్పుగా అంచనా వేశామా..? తక్కువ అంచనా వేశామా..? ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎందుకు ఓట్లు పడలేదు అనే విషయాలపై జగన్ నివాసంలోనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, కొడాలినాని, గురుమూర్తి, శివప్రసాద్ రెడ్డి, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఓటమి కారణాలను అంచనా వేస్తున్నారు. అయితే అతికొద్దిమంది నేతలు మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు.
మిగతా నేతలు ఈ మీటింగ్ కి ఎందుకు రాలేదు..? ముందుగానే సమాచారం ఇచ్చారా అనేది తేలాల్సి ఉంది. జగన్ చుట్టూ ఉన్న కోటరీ, కొంతమంది అధికారులు.. ఆయన్ను తప్పుదోవ పట్టించారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసిన ఆరోపణలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతుందా..? చర్చ పూర్తయిన తర్వాత మీడియాతో ఎవరైనా మాట్లాడతారా..? అనేది తేలాల్సి ఉంది.