Kakinada, May 24: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ (MLC Anantha Babu Arrest) చేశారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా కోర్టు కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో నిందితుడిగా ఒప్పుకున్న అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి నిన్న రాత్రి కోర్టు ముందు హాజరు పరిచారు. అతడికి 14 రోజుల పాటు రిమాండ్ (YSRCP MLC Anantha Babu remanded) విధించడంతో పోలీసులు రాజమహేంద్రవరం జైలుకు అర్ధరాత్రి తరలించారు.
ఈనెల 19న హత్యకు (ex-driver's murder case) గురైన డ్రైవర్ మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఎమ్మెల్సీ మృతుడి కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఎమ్మెల్సీని నిలదీయడంతో కారులో మృతదేహాన్ని ఉంచి అక్కడి నుంచి ఇతర ద్విచక్రవాహనంపై వెళ్లిపోయాడు. ఎమ్మెల్సీ వైఖరిని నిరసిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టడంతో వీరికి కాకినాడలోని పలు పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఎమ్మెల్సీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపడంతో దిగివచ్చిన పోలీసులు అనంతబాబును అదుపులోకి తీసుకుని విచారించారు.
అనంత బాబు అరెస్ట్ అనంతరం డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు వివరాలను కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మీడియాకు వెల్లడించారు. అనంతబాబుకు సుబ్రహ్మణ్యం రూ.25 వేలు ఇవాల్సి ఉందని.. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవ జరిగిందన్నారు. కోపంతో అనంతబాబు.. సుబ్రహ్మణ్యాన్ని వెనక్కి నెట్టడంతో గ్రిల్ వల్ల అతని తలకు గాయం కావడంతో మృతి చెందినట్లు ఎస్పీ పేర్కొన్నారు.