
Amaravati, Dec 1 : ఏపీలో అకాల వరదలతో రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల రైతులూ పెద్ద ఎత్తున నష్టపోయారు. ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారమే వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.2వేల కోట్లకు పైనే నష్టం జరిగింది. అత్యధికంగా 5.66 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతినడం.. 5వేల పశువుల మృత్యువాత వరదల తీవ్రతకు అద్దం పడతాయి. ప్రాజెక్టుల కట్టలు, వేల చెరువులు తెగిపోయాయి. రహదారులు కోతకు గురయ్యాయి. వంతెనలు కూలిపోయాయి. రైతులకు పెట్టుబడి సాయం, తాత్కాలిక పునరుద్ధరణ, శాశ్వత పునర్నిర్మాణ పనులకు రూ.6,333 కోట్లు కావాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.
వరదల్లో (Andhra Pradesh Floods) శాఖలవారీ నష్టంపై ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి అందించింది. వివిధ రంగాలకు సంబంధించి రూ.6333.66 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఎన్‌డీఆర్‌ఎఫ్ నిబంధనల ప్రకారం.. తాత్కాలిక సహాయ, పునరుద్ధరణ కార్యక్రమాలకు రూ.1235.28 కోట్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్ నిబంధనల పరిధిలోకి రాని పంట నష్టం, పునరుద్ధరణ కార్యక్రమాలకు రూ.1644.04 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.3454.34 కోట్లు అవసరమని తెలిపింది.
ఇక భారీ వర్షాలకు ఏపీ అతలాకుతలమైందని, రూ.6,054 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (YSRCP MP Vijayasai Reddy) అన్నారు. ఇవాళ రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా ఆయన వరదలపై మాట్లాడారు. తక్షణ సాయం కింద రూ.వెయ్యి కోట్లను విడుదల చేసి (Centre Rs 1000 crore as flood relief) ఏపీని ఆదుకోవాలని కోరారు. అసాధారణ వర్షాలతో 44 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 16 మంది ఆచూకీ దొరకలేదని వెల్లడించారు. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలను వర్షాలు ముంచెత్తాయని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని గుర్తు చేశారు.
రోడ్లు, బ్రిడ్జిలు, రైలు పట్టాలు, కరెంట్ స్తంభాలు కొట్టుకుపోయాయన్నారు. కొన్ని డ్యామ్ లు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగిందని, భారీగా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, 9 నుంచి 16 ఏళ్ల వయసు వారికి అమెరికాలోలాగానే మన దేశంలోనూ డెంగ్యూ వ్యాక్సిన్ ను తీసుకొస్తున్నారా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారు పడుతున్న ఇబ్బందులను తనవిగా భావించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని, ఎవరూ అధైర్యపడవద్దని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెదపళ్ల, కలవచర్ల గ్రామాల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే జగ్గిరెడ్డితో కలిసి అధిక వర్షాలకు పాడైన పంట పొలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు విలేకరులతో మాట్లాడుతూ వర్షాలకు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నా రబీకి నీటి కొరత లేకుండా చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులు రబీకి సిద్ధం కావడానికి ప్రభుత్వం తరఫున అందించాల్సిన సహాయ, సహకారాలపై కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు.