Cyclone Jawad: రాయలసీమ, నెల్లూరు జిల్లాకు తప్పిన ముప్పు, ఉత్తరాంధ్ర వైపు దూసుకువస్తున్న జవాద్ తుఫాను, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
Cyclone (Photo Credits: Wikimedia Commons)

Amaravati, Dec 1: ఇటీవల ఉపరితల ఆవర్తనం రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను అతలాకుతలం చేయగా.. ఇప్పుడు మరో తుపాను ముప్పు ఉత్తరాంధ్రను వణికిస్తోంది. దక్షిణ థాయ్‌లాండ్‌ వద్ద అండమాన్‌ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇది అల్పపీడనంగా బంగాళాఖాతంలో ఏపీ, ఒడిశా తీరం వైపు దూసుకొస్తోంది. మంగళవారం సాయంత్రం నెల్లూరు తీరానికి 1,400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఇది డిసెంబర్‌ 2వ తేదీకి వాయుగుండంగా, 3వ తేదీకి తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపానుగా బలపడితే దీనికి జవాద్‌ (Cyclone Jawad) అని పేరు పెట్టనున్నారు. 4వ తేదీ నాటికి ఇది ఉత్తరాంధ్ర (coastal districts in north Andhra Pradesh), ఒడిశా తీరం వైపు వచ్చి బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు. 5, 6 తేదీల్లో తీవ్ర తుపానుగా మారి శ్రీకాకుళం, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం అత్యధికంగా ఏపీపైనే ఉంటుంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలపై (neighbouring Odisha) ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 2వ తేదీ నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

నేడు మరో అల్పపీడనం, ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో పొడి వాతావరణం

ఈ తుఫాను ధాటికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని, ఈ ఐదు జిల్లాల రైతులు పంటలు కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తిరిగి వచ్చేయాలని కోరారు. ఈ తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమలోను ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గత వారం రోజుల నుంచి నెల్లూరు జిల్లాను వర్షాలు వణికిస్తున్నాయి. నెల్లూరు జిల్లా అనంత సాగరం మండలం పాతదేవరాయపల్లి ఎస్సీ కాలనీలో మట్టి గోడ కూలి అమ్మణ్ణమ్మ (6) చిన్నారి దుర్మరణం పాలైంది. చేజర్ల మండలం నాగుల వెలటూరులో 40 మేకలు వాగులో కొట్టుకుపోయాయి. తెలంగాణకు చెందిన ఇద్దరు మహిళలు ఏఎస్‌పేట–ఆత్మకూరు మధ్య గల కలుజు వాగులో కొట్టుకుపోగా స్థానిక యువకులు రక్షించారు. నాయుడుపేట మండలం పండ్లూరు రైల్వేగేటు సమీపంలో రహదారి వద్ద పాల క్యాన్లతో వెళ్తున్న ఆటో కొట్టుకుపోయింది. ఆటోలోని యువకులు వరద ప్రవాహం నుంచి బయటపడ్డారు. కాగా, వైఎస్సార్‌ జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టింది. బేతాయిపల్లె చెరువు అలుగు పారుతుండటంతో గోపవరం–బేతాయిపల్లె మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా నదిలో వరద ఉధృతి మళ్లీ పెరిగింది. సంగం, నెల్లూరు బ్యారేజీల నుంచి 1,81,756 క్యూసెక్కులను అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సోమశిల జలాశయం నుంచి 12 క్రస్ట్‌ గేట్ల ద్వారా 1.15 లక్షల క్యూసెక్కులను పెన్నా నదికి విడుదల చేస్తున్నారు. వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు.

వాగులు, చిన్నపాటి ఉపనదులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి గూడూరు ఆదిశంకర కళాశాల వద్ద దెబ్బతినడంతో వాహనాలు నిలిచిపోయాయి. గూడూరు సమీపంలో పంబలేరు వాగు ఉప్పొంగి కోల్‌కతా, చెన్నై రహదారిపై ప్రవహించింది. దీంతో ఎక్కడికక్కడ రోడ్డు దెబ్బతింది. వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఒక కిలోమీటరు దూరం ప్రయాణించాలంటే.. 4, 5 గంటల సమయం పడుతోంది. నాయుడుపేట వద్ద జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.