COVID-19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో 43 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1930కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, నేడు ఏపీకి రానున్న కేంద్ర ఆరోగ్య బృందం
Coronavirus Outbreak in AP | PTI Photo

Amaravathi, May 9:   ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా మరో 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19కేసుల సంఖ్య 1930కు చేరింది. ఈరోజు మరో ముగ్గురు కోవిడ్-19 పేషెంట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, కర్నూల్ జిల్లా నుంది ఒకరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 44కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 45 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 887 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 999 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

గత 24 గంటల్లో నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచి 16, చిత్తూరు జిల్లా నుంచి 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ తరువాత కర్నూల్ జిల్లా నుంచి 6, విశాఖ నుంచి 5, అనంతపూర్ జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:

status of positive cases of #COVID19 in Andhra Pradesh

ఇక కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న కర్నూలు జిల్లాకు ఈరోజు సాయంత్రం కేంద్ర వైద్య బృందం రానుంది. ఆదివారం నుంచి వారం రోజుల పాటు వీరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ బృందంలో ఆలిండియా ఇస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డా.‌ మధుమిత, మరియు ప్రొఫెసర్‌ డా. సంజయ్ ‌కుమార్ ముఖ్యులుగా‌ ఉన్నారు. కర్నూలు, నంద్యాల సహా తదితర ప్రాంతాలను వీరు సందర్శించనున్నారు. స్టేట్‌ కోవిడ్‌ హాస్పిటల్‌ అయిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కేఎంసీలోని వైరాలజీ ల్యాబ్‌, ఇక్కడి వసతులు, రోగులకు అందిస్తున్న చికిత్స తదితర విషయాలపై ఆరా తీసే అవకాశం ఉంది.