Amaravati, Mar 7: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 25 వరకు ( AP Budget Session 2022) కొనసాగనున్నాయి. ఈ మేరకు సోమవారం నాడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం పూర్తి అయిన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశమైంది. సభా నాయకుడి హోదాలో సీఎం జగన్, సభా వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, వైసీపీ తరఫున ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విపక్ష టీడీపీ తరఫున సభలో ఆ పార్టీ ఉప నేత కింజరాపు అచ్చెన్నాడులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎన్ని రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలన్న విషయంపై చర్చ జరగ్గా.. ఇరు వర్గాల వాదనల మేరకు ఈ నెల 25 వరకు సమావేశాలను కొనసాగించాలని స్పీకర్ నిర్ణయించారు. అంటే సెలవులు మినహా మొత్తం 13 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly budget Session) జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 11న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. దివంగత గౌతమ్ రెడ్డి మృతికి గౌరవ సూచకంగా ఈనెల 9వ తేదీన సభకు సెలవు ప్రకటించారు.
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి కేబినెట్ సంతాపం తెలిపింది. 2 నిమిషాలు సీఎం వైఎస్ జగన్, మంత్రులు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్‌ను దూషిస్తూ, గవర్నర్ ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించి గవర్నర్‌పై విసిరేయడంపై బీఏసీ సమావేశంలో టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. గవర్నర్ (Governor Biswabhushan Harichandan) ప్రసంగాన్ని అడ్డుకోవడంపై మంచి పద్ధతి కాదని అచ్చెన్నాయుడికి సీఎం జగన్ హితవు పలికారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదనే సంగతిని సీఎం జగన్ గుర్తుచేశారు. గవర్నర్ వయసులో పెద్దవారని, ఆయనకు మనం గౌరవం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం జగన్ తెలిపారు.
టీడీపీ వారికి ఆవేశం ఎక్కువని, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు ఎప్పుడు ప్రజల కోసం, దీర్ఘకాల నిర్ణయాలు తీసుకోరని విమర్శించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి బొత్స నారాయణ సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు స్వార్ధం కోసం నిర్ణయాలు తీసుకుంటారు.ప్రజల కోసం, దీర్ఘకాల నిర్ణయాలు వారు తీసుకోరు. శాసనసభ చట్టాలను చేయవద్దంటే ఎలా కుదురుతుంది.
రాజ్యాంగానికి లోబడే వ్యవస్థ అయినా పని చేయాలి. ఇది చర్చనీయాంశం. దీనిపై చర్చ జరగాలి. 2024 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాదు అని చట్టం చేశారు. శివరామకృష్ణ కమిటీని వేసి రాజధాని నిర్ణయం తీసుకోవాలన్నారు. కానీ చంద్రబాబు నారాయణ కమిటీ వేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకటన ఏదైనా పార్లమెంట్‌కు పంపలేదు. కాబట్టి హైదరాబాదే 2024 వరకు రాజధానే. గత ప్రభుత్వం రాజధాని వ్యవహారం లో చట్టబద్ధంగా వ్యవహరించలేదు.పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేస్తున్నాం’ అని బొత్స తెలిపారు.
గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు తన ఎమ్మెల్యేల చేత ఇలా చేయించడం దారుణమని, గవర్నర్ మాట్లాడుతుంటే గవర్నర్ ప్రసంగ ప్రతులని చింపి విసరడమంటే దుర్మార్గమన్నారు. టీడీపీ అరాచకాన్ని ఖండిస్తున్నామన్న మేరుగ.. ప్రజాస్వామ్యానికి లోబడే వ్యవహరించాలని టీడీపీ సభ్యులకు సూచించారు