
Vjy, Mar 3: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణం, డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమాధానమిచ్చారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీ గోడలను పూర్తిచేయాలంటే రూ.3వేల కోట్లు ఖర్చు అవుతుంది. మన బడి-మన భవిష్యత్తు.. నినాదంతో ఉపాధి హమీ దశల వారీగా వాటిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో’.. అనే క్యాంపెయిన్‌ను కూటమి ప్రభుత్వం చేపట్టింది. ప్రతి పాఠశాల, కాలేజీల్లో ‘ఈగల్’ బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ఇచ్చిన స్టార్ రేటింగ్ ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు వేస్తున్నామని అసెంబ్లీలో లోకేష్ తెలిపారు.
గత ప్రభుత్వం హయాంలో 117 జీవోతో నిరుపేదలకు విద్యను దూరం చేయడం వల్ల 12 లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారని తెలిపారు. దీనికి ఓ ప్రత్యామ్నాయంపై సభ్యులతో చర్చించాలని నిర్ణయించాం. సభ్యుల సలహాలు తీసుకుని ముందుకు వెళతాం. రంపచోడవరం నియోజకవర్గంలో 80 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. పాఠశాలల వద్ద సీసీ టీవీలు, లైటింగ్ ఏర్పాటు చేస్తాం. ‘లెర్నింగ్ ఎక్స్‌లెన్స్ ఆఫ్ ఏపీ’ కింద సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎలా సీఎస్ఆర్ ద్వారా అభివృద్ధి చేస్తున్నారో.. అలా మనం కూడా చేద్దాం’’ అని లోకేశ్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.
మెగా డీఎస్సీపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. ఆ పార్టీ సభ్యులు హాజరుకానప్పటికీ తాను సమాధానమిస్తానని సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుకు తెలిపారు. దీనిపై రఘురామ స్పందిస్తూ టీవీలో అయినా వైసీపీ సభ్యులు సమాధానం చూసుకుంటారని చెప్పగా.. ‘‘అలా చేస్తే టీవీలు పగిలిపోతాయి’’ అని లోకేశ్ నవ్వుతూ వ్యాఖ్యానించారు.