Amaravati, Sep 21: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health University)కి వైఎస్ఆర్ (YS Rajasekhar Reddy) పేరు పెట్టడంపై టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో వైఎస్ఆర్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ (NTR) నిర్మించిన విశ్వవిద్యాలయానికి మీ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటావని నిలదీశారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందే అని స్పష్టం చేశారు. ఉన్న సంస్థలకు పేర్లు మార్చితే పేరు రాదని... కొత్తగా నిర్మిస్తే పేరు వస్తుందని హితవుపలికారు. తెలుగు దేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు.
కాగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ బుధవారం సవరణ బిల్లును శాసనసభలో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ (2022) బిల్లును వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ట్వీట్ చేశారు. వైద్యవిద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1998లో మా ప్రభుత్వ హయాంలో ఆ సంస్థకు ఆయన పేరు పెట్టాం. జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యూనివర్సిటీ పేరును మార్చాలని వైఎస్‌ఆర్‌తో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రీ ఆలోచన చేయలేదు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు తొలగించి వైఎస్‌ఆర్ పేరు పెట్టడం అర్థరహితం. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని జగన్ ప్రభుత్వం.. ఉన్న వాటికే పేర్లు మార్చుతోందని మండిపడ్డారు. వర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులు కూడా బలవంతంగా కాజేసిన ఈ ప్రభుత్వం... ఏ హక్కుతో పేరు మార్చుతుందని నిలదీశారు. కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసి... వర్సిటీ పరువు తీసి ఇప్పుడు పేరు మార్చుతారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.