Vjy, Sep 13: అసెంబ్లీ సమావేశాల తేదీలను ఏపీ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 21 నుంచి అయిదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశముంది. ఇక ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అవ్వనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రి మండలి నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనుంది.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న జీపీఎస్ సంబంధిత బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనపై ఉద్యోగులు ఇటీవల సమావేశంలో కొన్ని మార్పులు కోరారు. సీఎం నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి భేటీ అయి వీటిని ఖరారు చేయాల్సి ఉంది.
ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేస్తే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ సమావేశాలపై గురువారం ప్రభుత్వ, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.