YSRCP Plenary: వైసీపీ ప్రాథమిక సభ్యుడైన తరువాతే ఎమ్మెల్యే, స్పీకర్‌ అయ్యాను, స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటన, రెండో రోజు జోరుగా వైసీపీ ప్లీనరీ సమావేశాలు..
(Pic Credit: Twitter )

తాను వైసీపీ ప్రాథమిక సభ్యుడైన తరువాతే ఎమ్మెల్యే, స్పీకర్‌ అయ్యానని శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం  చెప్పారు. ప్లీనరీ రెండోరోజు సమావేశంలో  స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడారు.

వైసీపీ అధికారంలోకి వచ్చి మూడో సంవత్సరం దాటి నాల్గవ ఏట అడుగుపెట్టాం. మనం మూడేళ్లలో సాధించిన విజయాలు అంతాఇంతా కాదు. మన శత్రువులపై వ్యూహాత్మకమైన దాడులు నిర్వహించాలి. లేకపోతే ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏనాడైనా ప్రతిపక్షాలు ప్రజల కోసం ఆలోచించారా.. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించారా..? కదనరంగంలో అడుగుపెట్టాం.. సమరానికి సిద్ధం అవుతున్నాం. ఈ సమయంలో మనం కచ్చితమైన ఉత్సాహభరితంగా ముందుకుసాగాలి. 2024లో మళ్లీ విజయాన్ని సాధించడమే మనముందున్న లక్ష్యం.. ఆ లక్ష్యంవైపు సాగేందుకు సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమం, అభివృద్ధి అనే ఆయుధాలు ఇచ్చారు.

YSRCP Plenary: రెండో రోజు ప్లీనరీ సమావేశాలు ప్రారంభం, 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని విజయసాయి రెడ్డి ప్రకటన, సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ ప్రసంగం..

 

స్పీకర్‌ ప్లీనరీకి వచ్చారు.. రాజకీయ సమావేశంలో పాల్గొంటున్నారని ఈనాడులో రాశారు. రామోజీరావు నేను అడుగుతున్నా.. గడిచిన మహానాడులో ఆనాటి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ మాట్లాడింది మీరు వినలేదా..? మీకు చెవులు వినిపించవా..? మీకు కళ్లు కనిపించవా..? ఆనాడు ఎందుకు రాశారు.

ప్రభుత్వం చేసిన మంచిని ఏనాడైనా రాశారా..? ఇది సరైన పద్ధతి కాదు. సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని పత్రికలకు చెబుతున్నా.. నేను బేసిక్‌గా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యుడిని, ఆ తరువాతే మా నాయకుడు ఆదేశం మేరకు శాసనసభ్యుడిగా, శాసనసభాపతిగా ఎన్నికయ్యాను. ఎస్‌.. ఇప్పటికీ చెబుతున్నాను.. నేను వైయస్‌ఆర్‌ సీపీ ప్రాథమిక సభ్యుడిని, తరువాతే శాసనసభ్యుడిని, శాసనసభాపతిని అని గర్వంగా చెబుతున్నాను.