Amaravathi, December 10: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (Assembly Winter Session 2019) రెండో రోజూ వాడివేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీ(Assembly)ని వైఎస్సార్‌సీపీ సభ్యులు పార్టీ కార్యాలయంగా మార్చారంటూ టీడీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై స్పీకర్ తమ్మినేని సీతారాం(Speaker Tammineni Sitaram) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అసెంబ్లీ ఎవరి జాగీరు కాదని... ప్రజల జాగీరని, ప్రజలు ఎన్నుకొని ఇక్కడికి పంపించారని తెలిపారు.
తన పరిమితలు తనకు తెలుసని స్పీకర్ అన్నారు.. ఆ పదాన్ని వారు ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని సభలో వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)కి మాట్లాడేందుకు అనుమతి ఇచ్చానని ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలను పక్కనపెట్టి ఓ సభ్యుడితో మాట్లాడించారంటూ టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేయడంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఎన్టీఆర్(NT Ramarao)కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ఆ పాపంలో తానూ భాగస్వామినేనని, అందుకే భగవంతుడు తనను 15 ఏళ్ల పాటు అధికారానికి దూరం చేశాడని స్పీకర్ అన్నారు. వంశీ మాట్లాడితే మీకు వచ్చే సమస్య ఏంటని స్పీకర్ టీడీపీ నేతల్ని ప్రశ్నించారు. ఆయనకు కూడా ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. గౌరవ సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం శాసనసభలో చేస్తే దాన్ని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించనని అన్నారు.
కాగా టీడీపీ రెబల్ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబు, ఆయన తనయుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరకాటంలో పడిన టీడీపీ సభ్యులు సభలో స్పీకర్‌పై విమర్శలు చేస్తూ వాకౌట్ చేశారు. వంశీ మాట్లాడిన అనంతరం టీడీపీ సభ్యులు మళ్లీ సభకు హాజరయ్యారు.
తనకు ప్రత్యేక స్థానం కేటాయించాలని వల్లభనేని వంశీ... అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. దీంతో అసెంబ్లీ రూల్స్ ప్రకారం వంశీకీ సీటు కేటాయిస్తామని స్పీకర్ అన్నారు. తన విచక్షణాధికారంతోనే వంశీకి అవకాశం ఇచ్చానని తెలిపారు. అయితే సభలో వంశీ కూర్చున్న సీటు ఇంతకముందే వేరే సభ్యుడికి కేటాయించడంతో 181, 182, 183 సీట్లు ఖాళీగా ఉన్నాయని స్పీకర్ తెలిపారు.
పంటలకు గిట్టుబాటు ధరపై చర్చించాల్సిందిగా పట్టుబట్టిన టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇది పార్టీ ఆఫీసు కాదని మందలించారు. చంద్రబాబు కల్పించుకోవడంతో స్పీకర్, చంద్రబాబు మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది. చంద్రబాబు పైనా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ సభ్యులు మండిపడ్డారు. స్పీకర్ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్ తమ్మినేని సీతారాం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదని, ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ చేస్తామన్న సీఎం మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.