Andhra Pradesh Assembly | Photo Credits : PTI

Amaravati, Nov 19: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ రెండవ రోజు సమావేశాలు (AP Assembly Session 2021) ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26 వరకు నిర్వహించాలని బీఏసీలో (BAC) నిర్ణయించిన విషయం తెలిసిందే. వ్యవసాయ రంగంపై చర్చ జరిగింది.

వ్యవసాయ రంగంపై సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వర్షం వలన ఇబ్బందులపై చర్చలు జరుగుతున్నప్పుడు.. ప్రతి పక్షాలు కేవలం రాజకీయ కోణంలోనే ప్రవర్తించాయని సీఎం జగన్‌ (CM YS Jagan) విమర్శించారు. ప్రతి పక్షం అంటే.. సలహలు, సూచనలు ఇ‍వ్వాలని సీఎం జగన్‌ హితవు పలికారు. మనం ప్రజలకు మంచి చేస్తే.. మనకు జరుగుతుందని అన్నారు. అనంతరం ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది.

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు (Kurasala Kannababu) మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక విస్తారంగా వానలు కురిశాయని తెలిపారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని కురసాల కన్నబాబు విమర్శించారు. అమిత్‌ షా తిరుపతికి వస్తే రాళ్లు వేయించిన చంద్రబాబు.. అదే ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆయన కాళ్లు పట్టుకున్నాడు. అసలు చంద్రబాబు గురించి మాట్లాడితే ఏడాది పాటు సభ పెట్టినా సరిపోదని విమర్శించారు.

గత టీడీపీ ప్రభుత్వం ఏనాడూ పూర్తి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదని కురసాల కన్నబాబు గుర్తుచేశారు. రైతుల బాగు కోసం టీడీపీ నేతలు ఏనాడైనా ఒక్క సలహా ఇచ్చారా? అని కురసాల కన్నబాబు ప్రశ్నించారు. కన్నబాబు మాట్లాడుతుంటే టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు , టీడీపీ సభ్యులు తామిచ్చిన అంశాలపై చర్చ జరపాలంటూ సభలో అంతరాయం కల్గించారు.

వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు, ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ శపథం, నా భార్యను రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆవేదన

వ్యవసాయంపై చర్చ జరుగుతున్న సందర్భంగా మంత్రి కొడాలి నాని పదేపదే టీడీపీ అధినేత చంద్రబాబు పేరును ఉచ్చరించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు... పదేపదే చంద్రబాబు పేరును ఎందుకు ఉచ్చరిస్తున్నారని ప్రశ్నించారు. అయినా తగ్గని కొడాలి నాని.. చంద్రబాబులా తాము లుచ్ఛా పనులు చేయలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో చంచల్ గూడ్ జైల్లో సమావేశాలు పెట్టుకునే పార్టీ వైసీపీ అని టీడీపీ నేతలు అన్నారు. కొడాలి నాని తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయంపై చర్చతో పాటు బాబాయికి గొడ్డలి పోటు... తల్లికి, చెల్లికి ద్రోహం విషయాలపై కూడా చర్చించేందుకు తాను సిద్ధమని అన్నారు. ఆ తర్వాత ఇరు పార్టీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది. మంత్రి కన్నబాబు మాట్లాడుతుండగా అడ్డు తగిలిన టీడీపీ సభ్యులు... గతంలో కన్నబాబు వేరే పార్టీలో ఉన్నప్పుడు 'జైల్లో మీటింగ్ పెట్టుకునే పార్టీ' అంటూ వైసీపీ గురించి మాట్లాడారని అన్నారు. ఆ తర్వాత మొత్తం చర్చ వ్యక్తిగత విషయాలపైకి వెళ్లింది. 'గంటా... అరగంటా' అంటూ టీడీపీ నేతలు గోల చేశారు. మాధవరెడ్డిని చంపింది ఎవరు? వంగవీటి రంగాను హత్య చేసింది ఎవరు? ఈ రెండు ఘటనలు జరిగినప్పుడు టీడీపీనే అధికారంలో ఉందని వైసీపీ సభ్యులు అన్నారు.

ఈ గందరగోళం మధ్య చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ అవమానాలు భరించలేనని... ఈ సభలో పడరాని అవమానాలు పడుతున్నానని... మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానని చెపుతూ సభ నుంచి వెళ్లిపోయారు. తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండిపడ్డారు. ఏ పరువు కోసమైతే తాను తాపత్రయపడ్డానో... దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు తన భార్య ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ఎన్నో చర్చలను చూశామని... కానీ ఇంత దారుణంగా సభ జరగడాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు.

కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ముఖం చూడాలనుందని సీఎం జగన్ అన్నప్పటికీ తాను పట్టించుకోలేదని చెప్పారు. తన కుటుంబసభ్యులను రోడ్డుపైకి లాగుతున్నారని అన్నారు. ఈ సభలో తాను ఉండలేనని... మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని సభలోని అందరికీ నమస్కారం చేస్తూ బయటకు వెళ్లిపోయారు. ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి బయటకు వచ్చేశారు.

వ్యవసాయ రంగంపై ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ.. సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారన్నారు. చంద్రబాబు కేవలం సింపతి కోసమే సభ నుంచి వెళ్లిపోయారని అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంపై మంత్రి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. సాగునీటి కాల్వలను పూడికతీసి పునరుద్ధరించామని తెలిపారు. చివరి ఆయకట్టు భూమివరకు సాగునీరు అందేల చర్యలు తీసుకున్నామని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు.

వ్యవసాయరంగంపై చర్చలో భాగంగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు కావాలని సభను, సభలోని సభ్యులను ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొట్టారని అన్నారు. సభలో సాక్ష్యాత్తూ.. స్పీకర్‌ను పట్టుకుని రాజకీయ భిక్ష పెట్టడం వంటి మాటలతో రెచ్చగొట్టారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం సానుభూతి కోసమే.. చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారని మండిపడ్డారు.

చంద్రబాబు వ్యాఖ్యలను, టీడీపీ సభ్యుల తీరును మంత్రి అప్పల రాజు ఖండించారు. చంద్రబాబు.. తల్లి గురించి, చెల్లి గురించి, చివరకు సీఎం సతీమణి ప్రస్తావన తెచ్చి సభలోని సభ్యులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మంత్రి అప్పలరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అసత్య ఆరోపణలపై.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. చం​ద్రబాబు కావాలని సభ సమయాన్ని వృథా చేస్తున్నారని మంత్రి రాజేం‍ద్రనాథ్‌ విమర్శించారు.

టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. సభను సజావుగా సాగేలా చూడాలని టీడీపీ సభ్యులకు హితవు పలికారు. వ్యక్తిగత విమర్శలకు పోకుండా సంప్రదాయ బద్ధంగా సభ జరిగేలా చూడాలన్నారు.

వాయిదా అనంతరం అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది.. ఈ క్రమంలో.. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ మాట్లాడుతూ.. టీడీపీ నేతలు వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తున్నారని ఎద్దేవా చేశారు. సభను కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కుటుంబ సభ్యుల ప్రస్తావన చంద్రబాబే తీసుకోచ్చారని.. బొత్స సత్యనారాయణ విమర్శించారు.

మంత్రి కొడాలి నాని సభలో మాట్లాడుతూ... మాధవరెడ్డి, వంగవీటి రంగా హత్య కేసుల గురించి కూడా చంద్రబాబు మాట్లాడాలని అన్నారు. ఈ రెండు హత్యలను చంద్రబాబే చేయించారని బయట మాట్లాడుకుంటున్నారని చెప్పారు. వైయస్ వివేకానందరెడ్డి హత్య గురించి చంద్రబాబు ఎలా మాట్లాడుతున్నారో... బాబు గురించి కూడా అలాగే చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. అన్ని విషయాలపై చర్చిద్దామని చెపితే... 'నా కుటుంబం గురించి మాట్లాడారు, నా భార్య గురించి మాట్లాడారు' అంటూ సింపథీ కోసం చంద్రబాబు ప్రయత్నం చేశారని విమర్శించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు సింపథీ చాలా అవసరమని... దీని కోసమే ఆయన ఇవన్నీ చేస్తున్నారని కొడాలి నాని అన్నారు. ముందస్తు ప్లాన్ లో భాగంగానే చంద్రబాబు ఈరోజు ప్రకటన చేశారని... ఈ అంశంపై నిన్ననే టీడీపీ నేతలతో చర్చలు జరిపారని ఆరోపించారు. నిన్న అసెంబ్లీకి చంద్రబాబు రాలేదని... దాదాపు రెండున్నర గంటల సేపు పార్టీ నేతలతో చర్చలు జరిపారని, నిన్న సాయంత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

అన్ని హత్యల గురించీ మాట్లాడదామని మేము చెపితే... నా భార్య గురించి మాట్లాడారు, నా కుటుంబం గురించి మాట్లాడారని చంద్రబాబు చెప్పారని... మోకాలికి, బోడిగుండుకి ముడిపెట్టారని విమర్శించారు. సభ నుంచి వెళ్లిపోవాలని చంద్రబాబు నిన్ననే డిసైడ్ అయ్యారని... అనుకున్నట్టుగానే ఈరోజు వెళ్లిపోయారని కొడాలి నాని అన్నారు. రాజకీయం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని చెప్పారు. చంద్రబాబువి మంగమ్మ శపథాలేనని ఎద్దేవా చేశారు.