AP Cabinet Dissolved: ఏపీలో మూకుమ్మడిగా 24 మంది మంత్రుల రాజీనామా, ఏపీ సీఎం నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని తెలిపిన కొడాలి నాని, ఏప్రిల్‌ 11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం
YS Jagan Cabinet (Photo-Twitter)

Amaravati, April 7: మరో రెండు సంవత్సరాల్లో రాబోయే ఎన్నికలకు సన్నద్దం అయ్యేందుకు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది.ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న (Andhra Pradesh Cabinet dissolved) నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా (all ministers submit resignation letters)చేశారు. మంత్రులంతా రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు.దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన క్యాబినెట్‌ సమావేశంలో ఏపీ మంత్రులంతా పాల్గొన్నారు.

మంత్రులంతా రెండున్నరేళ్ల వరకే కొనసాగుతారని ముఖ్యమంత్రి జగన్ (CM YS Jagan Mohan Reddy) ప్రకటించినందున ఆ గడువు గత డిసెంబర్‌లో ముగిసింది. దీంతో మంత్రివర్గంలో మార్పుచేర్పులు చోటు చేసుకుంటున్నాయి. మంత్రులు ఆళ్లనాని, ధర్మాన కృష్ణదాస్‌, పాముల పుష్ప శ్రీవాణి, కే నారాయణ స్వామి, అంజద్‌ బాషా, సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శంకర్‌ నారాయణ, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ఆదిమూలపు సురేశ్‌, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, తానేటి వనిత, రంగనాథ రాజు, అవంతి శ్రీనివాస్‌రావు, కన్నబాబు, పిన్నపి విశ్వరూప్‌, గమ్మనూర్‌ జయరాం, గోపాల కృష్ణ, సిదిరి అప్పలరాజు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు సాయంత్రం ఒక గంట ముందుగానే ఇంటికి వెళ్లిపోవచ్చని తెలిపిన జగన్ సర్కారు

ఈ సందర్భంగా సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.'మీ అందకి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తొలి విడత అవకాశం ఇచ్చాం. ఇప్పుడు మీరంతా పార్టీ బాధ్యతల్లోకి వెళ్తారు. మీకున్న విశేష అనుభవాన్ని పార్టీ కోసం వినియోగించుకోండి. అందరికీ జిల్లాల్లో పార్టీ బాధ్యతలు అప్పగిస్తాం' అని మంత్రుల రాజీనామా సందర్భంగా సీఎం జగన్‌ పేర్కొన్నారు. కాగా, మూడేళ్లపాటు ప్రభుత్వంలో మా బాధ్యతలను మేం నిర్వహించామని మంత్రులు ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వివరించారు. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లామన్న సంతృప్తి మాలో ఉందని మంత్రులు తెలియజేశారు. ఇక మిగిలిన రెండేళ్లపాటు పార్టీ కోసం పనిచేసి.. పార్టీని పటిష్టం చేస్తామని మంత్రులు సీఎం జగన్‌తో అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అయిదు గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌లు, 2026-27 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామని ఏపీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో ఏపీ మంత్రివర్గమంతా రాజీనామాలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవుల కంటే కూడా పార్టీ కోసం సేవలందించాలని సూచించిన మేరకు తామంతా కట్టుబడి రాజీనామాలు చేశామన్నారు. అనుభవం రీత్యా మంత్రివర్గంలో ఉన్న వారిలో 5,6 గురు మాత్రమే ఉంటారని సీఎం వెల్లడించారని వివరించారు.

11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. తమ కంటే ఎక్కువగా సీఎం జగన్‌ బాధపడ్డారని అయితే తామంతా జగన్‌కు మద్దతుగా ఉంటామని ధీమాను కల్పించామని చెప్పారు. తమ నాయకుడి కోసం తాను ఎలాంటి పదవులు చేపట్టడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. జగన్‌ తీసుకునే నిర్ణయాలు సామాన్యమైనవి కావని అన్నారు. కొనసాగే మంత్రుల పేర్లు ప్రకటించలేదని తెలిపారు.మంత్రుల రాజీనామా కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని సీఎంగా బాధ్యతలు తీసుకున్న రోజునే రెండున్నర సంవత్సరాల తరువాత రాజీనామాలు చేయాల్సి ఉంటుందని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మంత్రులు రాజీనామా చేసిన అనంతరం తమ సొంత వాహనాల్లో బయటకు వెళ్లిపోయారు.

చివరి కేబినెట్‌ భేటీ సందర్భంగా.. కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ విజయవంతంగా చేసినందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌కి అభినందనలు తెలుపుతూ కేబినెట్‌ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ను సీఎం జగన్‌ సహా కేబినెట్‌ మంత్రులు అభినందించారు.