Amaravati, April 7: ఏపీ కేబినెట్‌లో మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన 24 మంది వైసీపీ ఎమ్మెల్యేలు (Andhra Pradesh Cabinet dissolved) ఇంటికి వెళ్లే సందర్భంగా తమకు ప్రభుత్వం కేటాయించిన కాన్వాయ్‌లను కూడా వదిలేసి బయలుదేరారు. ఈ మేరకు కాసేపటి క్రితం అమరావతి పరిధిలోని ఏపీ సచివాలయంలో కీలక సన్నివేశం కనిపించింది.
గురువారం మధ్యాహ్నం. మొదలైన కేబినెట్ భేటీలో సీఎం జగన్ ఆదేశించిన మరుక్షణమే కేబినెట్‌లోని 24 మంది తమ పదవులకు రాజీనామాలు (AP Cabinet Dissolved) చేశారు. ఈ రాజీనామా లేఖలను వారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమర్పించారు. ఈ నెల 11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా జగన్ మంత్రులకు వివరించారు.
ఆ తర్వాత కేబినెట్ భేటీ ముగియగా.. బయటకు వచ్చిన మంత్రులు..మంత్రి హోదాలో ప్రభుత్వం తమకు కేటాయించిన కాన్వాయ్ లను (All Ministers leaves their convoys) అక్కడే వదిలేసి సొంత వాహనాల్లో ఇళ్లకు వెళ్లిపోయారు. కేబినెట్ భేటీకి ముందే మంత్రులంతా తమ చాంబర్లను ఖాళీ చేసినట్టు సమాచారం. ఇక ఏపీ మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని) కీలక వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానికి నాలుగు కొమ్ములేమీ లేవని, తాను కూడా అందరి మాదిరిగానే మంత్రి పదవికి రాజీనామా చేశానని ఆయన వెల్లడించారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం రాజీనామా చేసిన వారిలో అయిదారుగురుకి స్థానం ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. పనితీరులో సత్తా కనబరచిన వారో, అనుభవమున్న సీనియర్లో, లేదంటే సామాజిక వర్గ సమీకరణాలో తెలియదు గానీ... ఇప్పుడు రాజీనామాలు చేసిన వారిలో ఓ ఐదారుగురు మంత్రులకు కొత్త కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలున్నట్లు ఆయన చెప్పారు. కొడాలి నాని వ్యాఖ్యలతో ఏపీలో ఒక్కసారిగా ఓ పెద్ద చర్చకు తెర లేచింది.
కొత్త మంత్రివర్గంలో చోటు దక్కే ఐదారుగురు పాత మంత్రులు ఎవరంటూ ఎవరికి తోచిన లెక్కలతో వారు అంచనాలేస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక వర్గ సమీకరణాలను ప్రధానంగా ముందేసుకుని మరీ కొందరు లోతైన చర్చల్లోకి మునిగిపోయారు. అయితే ఆ ఐదారుగురు ఎవరన్న విషయం మాత్రం జగన్ ప్రకటించే దాకా ఏ ఒక్కరికీ తెలియదనే చెప్పాలి. ఈ తరహా వ్యవహారాల్లో చాలా సీక్రెసీని మెయింటైన్ చేస్తున్న జగన్.. చివరి నిమిషం దాకా సస్పెన్స్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
మంత్రులతో చివరి క్యాబినెట్ భేటీ నిర్వహించిన సీఎం జగన్ రాజీనామా చేసిన వారికి దిశానిర్దేశం చేశారు. "మీ అందరి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తొలివిడత అవకాశం ఇచ్చాం. ఇకపై మీరందరూ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతల్లోకి వెళతారు. మీకున్న అనుభవాన్ని పార్టీ కోసం వినియోగించండి. అందరికీ జిల్లాల్లో పార్టీ బాధ్యతలు అప్పగిస్తాం" అని వెల్లడించారు. మంత్రి పదవులకు తాము రాజీనామా చేస్తుంటే.. జగన్ ఎక్కువగా బాధపడినట్టుగా కనిపించిందని, అయితే తాము ఇష్టపూర్వకంగానే రాజీనామా చేస్తున్నామని, మీరేమీ బాధ పడాల్సిన అవసరం లేదని నాని వ్యాఖ్యానించారు.
మంత్రులంతా ఇళ్లకు బయలుదేరినా... నలుగురు మంత్రులు మాత్రం సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కేబినెట్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో బొత్సతో పాటు అవంతి శ్రీనివాస్, కన్నబాబు, తానేటి వనిత పాల్గొన్నారు. ఈ భేటీలో వారు తాజా పరిణామాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. అంతేకాకుండా కొత్త కేబినెట్‌లో ప్రస్తుతం రాజీనామా చేసిన వారిలో ఓ ఐదారుగురు ఉండే అవకాశం ఉందని సీఎం చెప్పడంతో వారు ఎవరన్న దానిపై కూడా ఈ భేటీలో మంత్రులు చర్చించినట్టు సమాచారం. ఓ అరగంట పాటు దీనిపై చర్చించిన తర్వాత మిగిలిన మంత్రుల మాదిరిగానే ఈ నలుగురు మంత్రులు కూడా ఇంటి బాట పట్టారు.