Amaravati, April 7: మరో రెండు సంవత్సరాల్లో రాబోయే ఎన్నికలకు సన్నద్దం అయ్యేందుకు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది.ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఏప్రిల్ 11న మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తున్న (Andhra Pradesh Cabinet dissolved) నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా (all ministers submit resignation letters)చేశారు. మంత్రులంతా రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు.దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన క్యాబినెట్ సమావేశంలో ఏపీ మంత్రులంతా పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) స్పష్టం చేశారు. సీఎం నిర్ణయానికి ప్రతి ఒక్కరం కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఏపీ కేబినెట్ బేటీ ముగిసిన అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. మొత్తం 24 మంది మంత్రులు రాజీనామా సమర్పించినట్లు తెలిపారు. ఏప్రిల్ 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక అశయం, సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారని కొడాలి నాని ప్రశంసించారు. సీఎం సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు సంతృప్తి ఉందన్నారు. ఇకపై శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతం అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు.
కాగా సామాజిక సమీకరణాల కారణంగా పాత మంత్రుల్లో అయిదారుగురు కేబినెట్‌లో కొనసాగే అవకాశం ఉందని అన్నారు. అనుభవం రీత్యా కొంతమందిని కొనసాగిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారని పేర్కొన్నారు. కొత్త కాబినేట్‌లో మీరు కొనసాగే అవకాశం ఉందా అని ప్రశ్నించగా..తనకు తక్కువ అవకాశాలు ఉన్నట్లు కొడాలి నాని తెలిపారు.
మంత్రులంతా రెండున్నరేళ్ల వరకే కొనసాగుతారని ముఖ్యమంత్రి జగన్ (CM YS Jagan Mohan Reddy) ప్రకటించినందున ఆ గడువు గత డిసెంబర్‌లో ముగిసింది. దీంతో మంత్రివర్గంలో మార్పుచేర్పులు చోటు చేసుకుంటున్నాయి. మంత్రులు ఆళ్లనాని, ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణి, కే నారాయణ స్వామి, అంజద్ బాషా, సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శంకర్ నారాయణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, తానేటి వనిత, రంగనాథ రాజు, అవంతి శ్రీనివాస్‌రావు, కన్నబాబు, పిన్నపి విశ్వరూప్, గమ్మనూర్ జయరాం, గోపాల కృష్ణ, సిదిరి అప్పలరాజు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు.