Amaravati, Oct 21: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ (CM Jagan VC) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల నిర్మాణ ప్రగతి, జగనన్న శాశ్వత గృహహక్కు పథకంపై సమీక్ష (CM YS Jagan Review) నిర్వహించారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలు, ఆర్బీకేల నిర్మాణాల ప్రగతి గురించి సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలపై కూడా ఈ సమీక్షలో సీఎం జగన్ చర్చించారు. ఖరీఫ్ అవసరాలు, రబీ సన్నద్ధతపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంపై సమీక్ష నిర్వహించారు.
అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. 2020 ఖరీఫ్‌కు సంబంధించిన సున్నా వడ్డీ పంట రుణాలు ఇవ్వాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమాల అమలుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. నవంబర్‌లో విద్యా దీవెనకు సంబంధించి కూడా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని సీఎం కోరారు. ఈ సందర్భంగా 10 రోజుల ఆసరా కార్యక్రమాలను నిర్వహించిన కలెక్టర్లు, అధికారులందరికీ అభినందనలు తెలిపారు.
ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం కోరారు. కృష్ణా, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలు గ్రామ సచివాలయాల నిర్మాణాల విషయంలో వెనకబడి ఉన్నారు. వెంటనే సచివాలయాల భవనాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి భవనాలను కూడా పూర్తిచేయాలని సీఎం అధికారులకు సూచించారు. వైయస్సార్ హెల్త్ క్లినిక్స్‌పైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురంజిల్లాల్లో మెటీరియల్ కాంపొనెంట్ వినియోగంపై తగిన దృష్టిపెట్టాలని సీఎం తెలిపారు.
కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు ఇచ్చాం. వారికి పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలి. వారికి రైతు భరోసా సహా.. అన్నిరకాలుగా అండగా ఉంటున్నాం. ఇన్‌పుట్‌సబ్సిడీ ఇస్తున్నాం, బీమా ఇస్తున్నాం, పంట కొనుగోలుకు కూడా భరోసా ఇస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో వారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు వెనకడుగు వేయాల్సిన పనిలేదు. అందుకే వారికి రుణాలు అందేలా కలెక్టర్లు దృష్టిపెట్టాలి. నవంబర్ నుంచి రబీ పనులు ఊపందుకుంటాయి. రబీకి అవసరమైన విధంగా అధికారులు సన్నద్ధంకావాలని సీఎం తెలిపారు.
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై సీఎం సమీక్ష
►ఈ పథకం వల్ల లక్షలమందికి ఉపయోగం
►47.4 లక్షల మంది లబ్ధి పొందుతారు
►పట్టాలు వీరిచేతికి అందుతాయి
►వారి ఇంటి స్థలంమీద వారికి అన్నిరకాల హక్కులు వస్తాయి
►దీనిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి
►ఈ పథకంమీద క్రమం తప్పకుండా సీఎస్‌గారు కూడా రివ్యూ చేస్తారు
►డిసెంబర్ 21న ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది
►100 ఏళ్ల తర్వాత సర్వే, రికార్డులను అప్‌డేట్ చేస్తున్నాం
►గ్రామాల్లో భూ వివాదాలకు పూర్తిగా చెక్‌పడుతుంది
►గ్రామ సచివాలయాల్లో సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు ఉంటుంది
►పైలట్‌ప్రాజెక్టుగా 51 గ్రామాల్లో జరుగుతోంది
►మరో 650 గ్రామాల్లో డిసెంబర్‌కల్లా పూర్తవుతుంది
► 2023 జూన్‌కల్లా మొత్తం సర్వే ప్రక్రియ ముగుస్తుంది
►కలెక్టర్లు, జాయింట్‌కలెక్టర్లు అంకిత భావంతో దీన్ని అమలు చేయాలి
►సర్వే అవగానే రికార్డులు అప్‌డేట్ అవుతాయి, కొత్త పాసుపుస్తకాలు యజమానులకు ఇస్తాం