Amaravati, Sep 19: ఏపీ రాష్ట్రంలో సాగునీటి రంగానికి చెందిన ప్రాజెక్ట్‌లు లక్ష్యం మేరకు పూర్తి చేసేందుకు వైయస్ జగన్ సర్కారు (YS Jagan Govt) ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ లు (Irrigation Projects in AP) లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయడంతో పాటు కొత్తవాటి కోసం మొత్తం ఐదేళ్లలో కనీసం రూ. 96550 కోట్లు వ్యయం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో నిర్మాణంలో ఉన్న వాటిని రూ.84092 కోట్లు వ్యయం చేయాలి. అలాగే కొత్త ప్రాజెక్ట్ లు (New Projects) పూర్తి చేయడానికి రూ.72458 కోట్లు ఖర్చు చేయాలి. ఈ నిధులు సమీకరణకు అవసరమైన చర్యలను ప్రభుత్వం ఎస్పీవీలు (స్పెషల్ పర్పస్ వెహికిల్) ఏర్పాటు చేస్తుంది.
పోలవరం ప్రాజెక్టును (Polavaram Project) త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్) ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకువెళుతోంది. ఇప్పటి దాకా మొత్తం ప్రాజెక్ట్లో 71.46 శాతం పనులు పూర్తి కాగా ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ కీలకమైనవి. స్పిల్ వే కాంక్రీట్, స్పిల్ వే ఛానెల్ లలో ఎంఈఐఎల్ పనిచేపట్టిన తరువాత 2.80 లక్షల ఘనపు మీటర్ల పని ఆరు నెలల కాలంలో జరిగింది. అదే సమయంలో స్పిల్ ఛానెల్, పవర్ హౌజు, గ్యాప్-1,2,3 లకు సంబంధించిన మట్టి, రాతికట్టి, కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి.
దీంతో పాటుగా రాష్ర్టంలో గతంలో చేపట్టిన పనులను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి జగన్ మూడు రకాల ప్రాధాన్యతలను నిర్ణయించారు. అందులో భాగంగా వచ్చే ఏడాది కొన్ని ప్రాజెక్ట్ లను వినియోగంలోకి తెచ్చేందుకు బడ్జెట్లు కేటాయించగా ఇతర ప్రాజెక్ట్ లను మూడు నుంచి నాలుగేళ్ళ సమయంలో పూర్తి చేయడానికి లక్షాలను నిర్దేశించారు. నిధుల కొరతను ఎదుర్కునేందుకు ఎసస్పీవీలను ఏర్పాటు చేశారు. అందులో ఎస్పీవీ-1 కింద రాయలసీమలో కరువు నివారణకు రూ.39980కోట్లు ఐదేళ్లలో ఖర్చు చేయనున్నారు. ఎస్పీవీ-2 కింది ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్లు పూర్తిచేయడానికి ఐదేళ్ల కాలంలో రూ. 8787 కోట్లు ఖర్చు చేస్తారు.
ఎస్పీవీ - 3 ద్వారా ఏపి రాష్ర్ట నీటి రక్షణ అభివృద్ధి కార్యక్రమం పేరుతో రూ.12702 కోట్లు ఐదేళ్ల కాలంలో సమీకరించనున్నారు. ఎస్పీవీ-4 పేరుతో పలనాడు కరువు నివారణ కార్యక్రమం ద్వారా ప్రధానంగా గోదావరి, కృష్ణా - పెన్నాల అనుసంధానం కోసం రూ.7636కోట్లు ఐదేళ్ల కాలంలో ఖర్చు చేస్తారు. ఎస్పీవీ-5 కార్యక్రమం క్రింద కృష్ణా-కొల్లేరు సెలినిటి మిటిగేషన్ కార్యక్రమం ద్వారా రూ.3356 కోట్లు సమీకరిస్తారు. సాగునీటి ప్రాజెక్ట్లకు నిధుల సమీకరణకు ఎస్పీవీలు ఏర్పాటు చేయడం అరుదైనది కాగా, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పట్టుదల వల్ల వ్యూహాత్మకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
ఆ క్రమంలో నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం–2, పూల సుబ్బయ్య వెలిగొండ–హెడ్ రెగ్యులేటర్ పనులు, వంశధార–నాగావళి లింక్, బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 రెండో దశ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం కాకుండా పనులు త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని ఏపీ సీఎం తెలిపారు. చిత్రావతి బాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీలు, గండికోట రిజర్వాయర్‌లో ఈ ఏడాది కచ్చితంగా కనీసం 23 టీఎంసీల నీరు నిల్వ చేయాలని, వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం రైతులకు ఎకరాకు కేవలం రూ.6.75 లక్షల పరిహారం ఇస్తే, ఇప్పుడు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నామని అలాగే ఆ ప్రాజెక్ట్ ల్లో నీరు నిండితే ఆయా ప్రాంత రైతులు ఉపయోగకరం అన్న విషయంపై రైతులకు నచ్చచెప్పి, అవగాహన కల్పించాలన్నారు.