YSR Jagananna Colonies: వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణ పనులను ప్రారంభించిన ఏపి సీఎం వైఎస్ జగన్, పేదవాడి సొంతింటి కల నిజం చేస్తున్నామని ప్రకటన
AP CM YS Jagan | File Photo

Amaravathi, June 3:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు పునాది వేశారు. గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ జగన్నన్న కాలనీలలోని ఇళ్ళ నిర్మాణ పనులను సీఎం ప్రారంభించారు. 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు' పథకంలో భాగంగా మొదటి దశలో రూ. 28,084 కోట్ల వ్యయంతో 15,60,227 పక్కా ఇళ్ల నిర్మాణాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో అనుసంధానం చేసుకుని గృహ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు, వచ్చే ఏడాది జూన్‌ 22 కల్లా తొలి దశ గృహ నిర్మాణాల పనులు పూర్తి చేస్తామని జగన్ స్పష్టం చేశారు. ఇకపై ఇళ్లు లేని పేదలు రాష్ట్రంలో ఎక్కడా ఉండకూడదని జగన్ అన్నారు.

సీఎం జగన్ మాట్లాడుతూ "పేదల సొంతింటి కల నెరవేరబోతోంది, పండుగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేస్తున్నాం. తొలి దశలో 175 నియోజకవర్గాల్లో గృహ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగా మొదటి విడతలో రూ. 28,084 కోట్లతో 15.60 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నాం, వచ్చే ఏడాది జూన్ 22 నాటికి ఇది పూర్తవుతుంది, రెండో దశలో 12.70 లక్షల ఇళ్లను రూ. 22,860 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నాం. PMAYతో అనుసంధానం చేసుకొని ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. మొత్తం 17,000 జగన్నన్న కాలనీలలో ఇళ్లను నిర్మిస్తున్నాం" అని సీఎం జగన్ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల కుటుంబాలకు స్థిరాస్తులు పంచడమే కాకుండా, వారికి ఇళ్లు కూడా నిర్మిస్తున్నామని, విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్, తాగునీరు, ఇంటర్నెట్ సదుపాయాలతో జగన్నన్న కాలనీలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. జగన్నన్న కాలనీలలో మౌలిక సదుపాయాల కోసమే రూ. 32,909 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.  కేవలం ఇళ్లు నిర్మించడమే కాకుండా లబ్ధిదారులు సౌకర్యవంతంగా నివసించేందుకు వీలుగా 340 చదరపు అడుగుల ఇంట్లో బెడ్ రూమ్, హాల్, కిచెన్, బాత్రూమ్ మరియు వరండాను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, 4 బల్బులు మరియు ఒక సింటెక్స్ ట్యాంక్ సమకూరుస్తున్నట్లు సీఎం తెలిపారు.

ఇక ఇంటి నిర్మాణంలో లబ్దిదారులు తమ ఇంటీరియర్ కోసం తమకు కావాల్సిన నిర్మాణ సామాగ్రిని తెచ్చుకునే స్వేచ్ఛను కల్పించారు. అలాగే ఈ పథకానికి అర్హులై ఉండి లబ్దిదారుల జాబితాలో తమ పేరు లేకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు సరిగ్గా ఉంటే 90 రోజుల్లో జాబితాలో వారి పేరు నమోదు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.