New Delhi, April 5: ప్రధాని నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై కీలక చర్చలు జరుపుతున్నారు. ప్రధాని మోదీతో భేటీ ముగిసిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్ భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు మొదలుకానున్న ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు, భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన ఆవశ్యకతలపై నిర్మలతో జగన్ చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీ ముగిసిన తర్వాత రాత్రి 9.30 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.
ఇకపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన ఢిల్లీ నివాసం వద్ద మంగళవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కోసం మంగళవారం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రానికే జగన్ ఢిల్లీ చేరుకోగా... జగన్ ఢిల్లీ చేరుకోవడానికి కాస్తంత ముందుగా జగన్ నివాసం ఉన్న జనపథ్ పరిసరాల్లో వాహనాల రాకపోకలను రద్దు చేశారు.
జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రోజే రాజధాని అమరావతి రైతులు కూడా ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ కోసమే అమరావతి రైతులు ఢిల్లీకి వెళ్లగా.. వారు జగన్ నివాసం వద్ద నిరసన తెలిపే అవకాశముందన్న భావనతో పోలీసులు జగన్ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.